వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?

by Harish |
వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) భారత్‌లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఓలా లాంటి కంపెనీలు ఈ విభాగంలోకి వచ్చిన నేపథ్యంలో హోండా కంపెనీ ప్రవేశం ద్వారా పోటీ మరింత పెరుగుతుందని ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

భారత మార్కెట్లో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న హెచ్ఎంఎస్ఐ తన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన వివరాలను వెల్లడించలేదు. అయితే, తన మాతృ సంస్థ హోండా మోటార్ అభివృద్ధి చేసిన ఎలక్త్రిక్ స్కూటర్ బెన్లీని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో పర్యవేక్షణకు అందించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. హోండా మోటార్ 2019లోనే బెన్లీ స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. వాణిజ్య పరమైన అవసరాల కోసం రూపొందించిన ఈ స్కూటర్ భారత్‌లోకి తీసుకొస్తుందా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

హోండా మోటార్ ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి మూడు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించింది. హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు పరిశీలిస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థ నుంచి మొదటి ఈవీ స్కూటర్‌ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనం కోసం విడిభాగాల సేకరణ, సరఫరా భాగస్వాములకు చర్చలు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఈవీలను ఎగుమతి చేస్తామని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed