సిటీ కొత్త వేరియంట్‌లను లాంచ్ చేసిన హోండా!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(HCIL) తన పాపులర్ సెడాన్ హోండా సిటీ పెట్రోల్ వేరియంట్‌లను మంగళవారం లాంచ్ చేసింది. ఈ మోడల్ కారు ధర ఎక్స్‌షోరూమ్ ఢిల్లీలో రూ. 9.29 లక్షలతో లభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇటీవల హోండా సిటీ సెడాన్ (Honda City sedan) సరికొత్త ఐదవ తరం కారును విడుదల చేసింది. ఇప్పుడు నాలుగవ తరం కారును ఎస్‌వీ, వీ గ్రేడ్‌లతో రెండు వేరియంట్‌లను బీఎస్6 (BS-6) ప్రమాణాలతో తీసుకొచ్చింది.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ మోడళ్లను విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌లలో ఎస్‌వీ వేరియంట్ ధర రూ. 9,29,900 కాగా, వీ గ్రేడ్ ధర రూ. 9,99,900తో ఉండనున్నట్టు తెలిపింది. ‘నాలుగో తరం హోండా సిటీ అమ్మకాలను కొనసాగించాలని కంపెనీ నిర్ణయించింది. సమకాలీన స్టైలింగ్ డిజైన్‌తో, సెడాన్ విభాగంలో ఆదరణ ఉన్న ఈ మోడల్‌ను బీఎస్6 ప్రమాణాలతో కొనసాగించాలని నిర్ణయించినట్టు హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, సేల్స్ డైరెక్టర్ రాజేష్ హోయెల్ చెప్పారు.

నాలుగవ తరం హోండా సిటీ కారును 2014, జనవరిలో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అప్పటినుంచి మొత్తం 3.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైనట్టు హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. సరికొత్త ఐదవ తరం హోండా సిటీ సెడాన్ ధర రూ. 10.90 లక్షల నుంచి 14.65 లక్షల(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)తో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement