నో అపాయింట్‌మెంట్ .. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

by srinivas |
నో అపాయింట్‌మెంట్ .. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25,26న రెండు రోజులపాటు చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.35కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అనంతరం చంద్రబాబు అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన నేపథ్యంలో అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. దీంతో చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. అయితే చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించిన విషయాన్ని పేషీ అధికారులు అమిత్ షాకు తెలియజేయడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు.

తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో కలవడం కుదరలేదని, మరోసారి కలుద్దామని చెప్పారు. అపాయింట్‌మెంట్ కోరడానికి గల కారణాలను అమిత్ షా ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. అయితే ఏపీ పరిస్థితులపై వినతి పత్రం తయారు చేశామని, అది పంపుతున్నామని చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు వంటి విషయాలను షాకు వివరించారు. అలాగే ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడినా దాని మూలాలు ఏపీకి రావడం, ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. అదే విధంగా తాము రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ పార్టీ కార్యాలయం తెలిపింది.

Next Story

Most Viewed