హెచ్ఎండీఏ సైట్ క్రాష్

by Shyam |   ( Updated:2021-09-24 10:53:05.0  )

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ఆన్‌లైన్ వెబ్‌సైట్ క్రాష్ అయింది. వారం రోజులుగా వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను ఈ సైట్ ఇవ్వలేకపోతున్నది. ఎల్ఆర్ఎస్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు సాంకేతిక చిక్కులు ఏర్పడ్డాయి. వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ దగ్గర సైట్ మొరాయిస్తున్నది. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులు గమనించినా.. పరిష్కరించడానికి ఇబ్బంది పడుతున్నారు. వెబ్‌సైట్ నిర్వహణ థర్డ్ పార్టీకి కాంట్రాక్టు ఇచ్చినందున వారం రోజులుగా పక్రియ కొనసాగుతూ ఉన్నదనే సమాధానం అధికారుల నుంచి వినిపిస్తున్నది. మరో నాలుగైదు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది.

ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆన్‌లైన్ సర్వీస్ వెబ్ పోర్టర్ సర్వర్ బూర్గుల రామకృష్ణారావు భవన్‌‌లో ఉన్నదని, దీన్ని గచ్చిబౌలిలోని సెంట్రల్ డేటా సెంటర్‌కు మారుస్తున్నారని, అందువల్లనే వినియోగదారులకు ఎల్ఆర్ఎస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే సర్వర్ షిప్టింగ్ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని, సైట్‌కు లింక్ చేసి వినియోగంలోకి తేవడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని వివరించారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల డేటా మొత్తం క్రాష్ అయిందని, తిరిగి తెచ్చుకునే అవకాశం లేదని, మాన్యువల్‌గా వచ్చిన అప్లికేషన్లను దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరి వివరాలను ఆపరేటర్లు నమోదు చేయక తప్పదని సిబ్బంది ఒకరు తెలిపారు. ఇదే విషయాన్ని ఆ అధికారి దగ్గర ప్రస్తావించగా,..మూడు చోట్ల డేటాను భద్రపరిచామని, సర్వర్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత డేటా మొత్తం తిరిగి యధావిధిగా రిస్టోర్ అవుతుందని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న పనులను దృష్టిలో పెట్టుకుంటే.. మంగళవారం రాత్రికల్లా మొత్తం రెడీ అవుతుందని, బుధవారం ఉదయం నుంచి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed