పొత్తూరి.. జర్నలిజం సొంతూరు

by Shyam |   ( Updated:2020-03-05 07:04:16.0  )
పొత్తూరి.. జర్నలిజం సొంతూరు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు, రచయిత పొత్తూరి వెంకటేశ్వరరావు గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. ఉద్ధండ జర్నలిస్టులు, ముఖ్యమంత్రులు, నాయకులతో ఆయన కలసి పనిచేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా, రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

ఆంధ్రజనతతో పొత్తూరి ప్రస్థానం..

1934 ఫిబ్రవరి 8న ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. జర్నలిజంలోకి రావడానికి ఆసక్తి పత్రికలు చదవడం వల్లే కలిగిందనీ, చిన్నతనంలో రోజూ హిందూ, ఆంధ్రప్రభ పత్రికలు చదివినట్టు పొత్తూరి చెప్పేవారు. దాదాపు 50 ఏళ్లపాటు పాత్రికేయరంగంలో ఆయన పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. ఆంధ్రజనత పత్రికతో జర్నలిజంలో కెరీర్‌ను ప్రారంభించిన పొత్తూరి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త, ఉదయం పత్రికల్లో పనిచేశారు. సబ్ ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్ చేసి ఎడిటర్‌గా పనిచేశారు. ఈనాడు చీఫ్ ఎడిటర్‌గానూ పనిచేశారు. తెలుగులోని వివిధ పత్రికల్లో కాలమ్స్ రాశారు. టీటీడీ ప్రచురణలకు గౌరవ సంపాదకులుగానూ ఆయన సేవలందించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తనదైన ప్రత్యేక శైలిని పొత్తూరి చూపారు.

విలువల జర్నలిజానికి ఆద్యుడు

జర్నలిజంలో విలువల కోసం రాజీనామా చేసిన వ్యక్తి పొత్తూరి. ఉదయం పత్రిక చీఫ్ ఎడిటర్‌గా ఉన్న సమయంలో ఓ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ప్రచురణ ఆపాలని యాజమాన్యం కోరితే.. తాను అందుకు సిద్ధంగా లేనని తన సంపాదకత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. సామాజిక బాధ్యతతో ఆయన తన రచనలు, వ్యాసాలతో జాగృతం చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ ఏర్పాటు చేసిన రైతు సమస్యల అధ్యయన కమిటీలో కోడెల శివప్రసాదరావు, కరణం బలరామ్‌లతో కలిసి పొత్తూరి పనిచేశారు.

సత్యాన్నే చెప్పండి..

ప్రస్తుత మీడియాలో సెన్సేషనలిజం, సత్యదూరంగా మారిందా? అని ఓ ఇంటర్వ్యూలో పొత్తూరిని ప్రశ్నించినప్పడు ఆయన చెప్పిన సమాధానం ఆదర్శనీయం. ‘‘సత్యం భ్రూయత్ ప్రియం భ్రూయత్ న భ్రూయత్ సత్యం అప్రియం’’ అని ఒక సూక్తి ఉందనీ, దాని అర్థం అప్రియమైన సత్యాన్ని చెప్పొద్దు. అయితే, అది అప్రియమైనప్పటికీ లోకానికి మేలు చేసేదైతే చెప్పకుండా ఉండొద్దు’ అని పొత్తూరి చెప్పారు. తన జర్నలిజం కెరీర్‌లో అదే సూత్రాన్ని పాటించానని తెలిపారు. అపకారం జరుగుతుందని అనిపించకపోతే సత్యాన్ని తప్పక చెప్పాలనీ, ప్రజల అవసరాలను డిగ్నిఫైడ్‌గా హైలెట్ చేయాలని, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ఆ బాధ్యత మీడియా, పత్రికల ఎడిటోరియల్ బోర్డులపై ఉందని, అది వాళ్ల గురుతర బాధ్యత అని గుర్తు చేశారు.

పాలసీలు విమర్శించాల్సిందే..

తాను వ్యక్తులను కాకుండా ప్రభుత్వాల పాలసీలు విమర్శిస్తున్నానని, అలా స్వేచ్ఛగా విమర్శలు చేసేవాడినని చెప్పారు. ఆ మేరకే ఆంధ్రప్రభలో ఎడిటర్‌గా చేరానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనపై టీడీపీ నాయకులూ రామ్‌నాథ్ గోయెంక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎండీకి కంప్లెయింట్లు ఇచ్చారనీ, అయితే, తాను పాలసీలు విమర్శించడం ప్రజల కోణంలో చేసిందనీ, అందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సైతం విమర్శ ఉండాల్సిందేనని చెప్పారన్నారు.

పొత్తూరి రచనలు

1.మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పుస్తకం ‘‘ఇయర్స్ ఆఫ్ పవర్’’
2.ఆధ్యాత్మిక పదకోశం
3.నాటి పత్రికల మేటి విశేషాలు
4.చింతన
5.చిరస్మరణీయులు
6.ఆధునిక పదకోశం

tags : journalist, potturi, press academy ex chairman

Advertisement

Next Story

Most Viewed