పవర్‌కు దిక్కు.. పైన్ చెట్లు

దిశ, వెబ్‌డెస్క్: హిమాలయాలను దూరం నుంచి చూసేవారికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ దానికి దగ్గరల్లో నివసించేవారు మాత్రం అటు ఊహించని వైపరీత్యాలు, ఇటు అరకొర సౌకర్యాలతో నానా ఇబ్బందులు పడతారు. కాబట్టి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకునే అవసరాలు తీర్చుకోవాలి. ఆ వాతావరణంలో ఎక్కువగా కనిపించేవి పైన్ చెట్లు. ఇవి కలప విషయంలో ఎంతలా ఉపయోగపడినప్పటికీ వీటికి ఉండే ముల్లుల వల్ల కలిగే నష్టం మాత్రం అంతా ఇంతా కాదు. అదేదో నడుస్తుంటే ముల్లులు కుచ్చుకుంటాయని అనుకోవద్దు. అది కాదు అసలు సమస్య.. ఈ పైన్ చెట్ల ముల్లులకు వెంటనే మంట అంటుకుంటుంది. దీంతో వేసవి కాలంలో ఒక్క ముల్లు మీద నిప్పు సెగ రగిలిందంటే ఇంక ఆ అడవి మొత్తం దగ్ధమవ్వాల్సిందే. ఈ కార్చిచ్చు కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో జీవవైవిధ్యం నాశనమవుతోంది. ఆ మంటల వల్ల ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు మాడి మసైపోతున్నాయి. మరి సమస్యకు పరిష్కారం?

ఏముంది… పైన్ ముల్లులన్నీ ఒక్కసారే ఏరిపారిస్తే సరిపోతుందని మీరు అనుకోవచ్చు. కానీ అలా చేయడం కుదరదు. దాదాపు ఉత్తరాఖండ్ కొండ ప్రాంతం మొత్తం ఈ పైన్ చెట్లతోనే నిండి ఉంటుంది. బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే వేల ఎకరాల్లో ఈ షిర్ పైన్ చెట్లను పెంచేవారు. వీటి నుంచి ముఖ్యంగా కలపను, రెసిన్‌ను తీసేవారు. దీంతో మొత్తం ఉత్తరాఖండ్‌లో 4 లక్షల హెక్టార్ల భూమిలో ఈ షిర్ పైన్ చెట్లే ఉన్నాయి. ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య కాలాల్లో ఈ షిర్ పైన్ చెట్ల నుండి ముల్లులు రాలతాయి. ఆ తర్వాత ఏ చిన్న అగ్గి రాజుకున్నా మొత్తం అడవి మీద ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఇవి నేల మీద పడటం వల్ల భూమి కూడా పొడిగా తయారవుతుంది. వీటిని ఊరికే తొలగించడం సాధ్యం కాదు. ఒక సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లో రాలే పైన్ ముల్లులను ఒక చోట పేరిస్తే అవి ఈజిప్టు పిరమిడ్ కంటే ఎక్కువ ఎత్తుగా ఉంటాయి. అందుకే వీటిని ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినా, వాటిని వేరే చోట పోయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్.. వాటిని ఏదో ఒక మంచి పనికి ఉపయోగించడం మాత్రమే.

ఆ ప్రాంతానికి చెందిన రజ్నీష్ జైన్ కూడా అచ్చం ఇలాగే ఆలోచించాడు. పైన్ ముల్లులను ఏదో ఒక రకంగా ఉపయోగిస్తే కానీ, ఈ కార్చిచ్చుల సమస్య తీరదని ఆయన గ్రహించాడు. దాని గురించి బాగా ఆలోచించాడు. 1994 సమయంలో ఇంజినీర్ ఎస్ దాసప్ప బృందం కనిపెట్టిన బయోమాస్ గ్యాసిఫికేషన్ విధానం గురించి తెలుసుకున్నాడు. వరిపొట్టు, ఇతర ఎండిపోయిన ఆకులు, కొబ్బరి పొట్టులను ఉపయోగించి విద్యుత్ తయారు చేయడమే ఈ ప్రక్రియ. ఈ విధానంలో కర్ణాటకలో 30 యూనిట్లు ఏర్పడిన సంగతి తెలుసుకుని వాటిని సందర్శించి, ఆ ప్రక్రియ గురించి లోతుగా అధ్యయనం చేశాడు. తర్వాత 2007లో ఇదే ప్రక్రియలో వరిపొట్టుకు బదులుగా పైన్ చెట్ల ముల్లులను ఉపయోగిస్తే ఎలా ఉంటుందని నేరుగా ఎస్ దాసప్ప దగ్గరికి వెళ్లి అడిగాడు. ఆ ముల్లుల సాంద్రత తక్కువగా ఉంటుందని అవి విద్యుత్ ఉత్పత్తికి పనికిరావని దాసప్ప చెప్పాడు. కానీ రజ్నీష్ వెనక్కి తగ్గలేదు. మళ్లీ తన మెదడుకు పదును పెట్టి పరిష్కారాన్ని కనుక్కున్నాడు. అదేం పరిష్కారం?

పైన్ ముల్లులను సగానికి కత్తిరించి ఉపయోగిస్తే వాటి సాంద్రతను పెంచవచ్చని తెలుసుకున్నాడు. అంతే ఇక రజ్నీష్ ఆగలేదు. బయోమాస్ ప్లాంట్‌ను పెట్టించాడు. పైన్ ముల్లుల ప్రాసెసింగ్‌కు తగినట్లుగా కొన్ని సెట్టింగ్‌లు మార్చాడు. వాటిని సగానికి కత్తిరించి ప్రాసెసింగ్ చేసి మొదటి ప్రయత్నంలోనే 9 కిలో వాట్‌ల సామర్థ్యం గల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు. అప్పటివరకు అతన్ని చూసి హేళన చేసిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. ఈ విద్యుత్‌ను ఉపయోగించి రజ్నీష్ ఇంట్లో కాంతులు వెలగడం చూసి వాళ్లకు కూడా ప్లాంట్ కావాలని పిత్తోర్‌ఘడ్ జిల్లా మొత్తం రజ్నీష్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఇంకో లాభం ఏంటంటే, విద్యుత్ ప్రాసెసింగ్‌లో పైన్ ముల్లులను ఉపయోగించిన తర్వాత ఉత్పత్తయ్యే అంతిమ పదార్థాన్ని ఇంట్లో వంటచెరుకుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఓ పక్క అవసరాన్ని తీరుస్తూ ప్రకృతిని కాపాడే ఈ ఐడియాను ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే.

Advertisement