సెకనులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం డౌన్‌లోడ్!

by  |
సెకనులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం డౌన్‌లోడ్!
X

సినిమాలు డౌన్‌లోడ్ చేయడానికి చాలా వేగవంతమైన ఇంటర్నెట్ కావాలి. ఇక స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అయితే లక్షల కొద్దీ సినిమాలు ఉంటాయి. వాటన్నింటినీ డౌన్‌లోడ్ చేయాలంటే, ఎంత ఇంటర్నెట్ వేగం కావాలి? అది కూడా ఒక్క సెకనులో డౌన్‌లోడ్ చేయడానికి ఎంత ఉండాలి? దీనికి సమాధానం సెకనుకి 178 టెరాబిట్స్. అంటే 178,000 జీబీపీఎస్ అన్నమాట. అయితే ఇంత స్పీడ్‌ను అందుకుంటేనే కదా.. దాని గురించి తెలిసేది. యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన పరిశోధకులు ఇంత వేగంతో ఉన్న ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసుల జమానాలో ఇంటర్నెట్ వేగం మరింత ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంగా పరిశోధకులు దాన్ని రెట్టింపు చేసే కొత్త ఆంప్లిఫైయర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ పరిశోధకురాలు డాక్టర్ లిడియా గాల్డినో ఈ ప్రయోగం చేశారు. గత మే నెలలో ఆస్ట్రేలియాలో సెకనుకు 44.2 టెరాబిట్స్ ఇంటర్నెట్ వేగాన్ని పొందడాన్ని ఆదర్శంగా తీసుకుని ఆమె ఈ పరిశోధనకు పూనుకున్నారు. ఇందుకోసం ప్రామాణికంగా ఉన్న ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ కాకుండా ఎక్కువ తరంగదైర్ఘ్యం తట్టుకోగల ఫైబర్‌ను ఉపయోగించారు. అలాగే సిగ్నల్ బలాన్ని విపరీతంగా పెంచడానికి వీలుగా కొత్త ఆంప్లిఫైయర్ టెక్నాలజీని రూపొందించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ 4.5 టెరా హెర్జ్‌ నుంచి 9 టెరా హెర్జ్‌ల వరకు ఉంటుంది. అయితే 178 టెరాబిట్ వేగం కావాలంటే 16.8 టెరా హెర్జ్‌ల బ్యాండ్‌విడ్త్ ఉపయోగించాలని ఆమె అన్నారు. అయితే ఈ కొత్త ఆంప్లిఫైయర్‌లకు ఖర్చు కూడా చాలా తక్కువని, కాబట్టి భవిష్యత్తులో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాలు సాధ్యమేనని లిడియా వెల్లడించారు.


Next Story

Most Viewed