గాంధీలో అందుబాటులోకి హై టెక్నాలజీ సిటీ స్కాన్ : మంత్రి హరీష్ రావు

by Shyam |   ( Updated:2021-12-11 03:31:02.0  )
గాంధీలో అందుబాటులోకి హై టెక్నాలజీ సిటీ స్కాన్ : మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆసుపత్రిలో మరో అత్యాధునిక సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చింది. రూ.2 కోట్ల విలువైన సిటీ స్కాన్ మిషనరీని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగుల సౌకర్యార్థం సర్కార్ ఆసుపత్రుల్లో కొత్త మిషన్లను తీసుకువస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో గాంధీలో 6.5 కోట్లతో నూతన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రూ 12.5 కోట్లతో ఎంఆర్ఐనూ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండూ పరికరాలను వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మాతాశిశు సేవల కోసం గాంధీలో 200 పడకల మదర్, చైల్డ్ వార్డుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదు నెలల్లో అవి పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. ఇక కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది అద్భుతంగా సేవలు అందించారని కొనియాడారు. 84,127 మందికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని ప్రశంసించారు. దవాఖానలోని సిబ్బంది అందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన సమయంలో కూడా గాంధీ దవాఖాన ప్రజలను ఆదుకున్నదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖానపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రికి ఇప్పటి వరకు రూ. 176 కోట్లు విడుదల చేయగా, ఇందులో 100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని వివరించారు. మరో 76 కోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. రిస్క్ దేశాల నుంచి 3,235 మందిరాగా వారిలో 15 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో 13 మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story