ఎనుమాముల మార్కెట్‌లో అక్రమాలు.. య‌థేచ్ఛ‌గా చిల్ల‌ర కాంటాల దందా

by Shyam |   ( Updated:2021-12-18 05:35:47.0  )
ఎనుమాముల మార్కెట్‌లో అక్రమాలు.. య‌థేచ్ఛ‌గా చిల్ల‌ర కాంటాల దందా
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్‌లో చిల్లర కాంటాల హ‌వా కొన‌సాగుతోంది. రైతుల క‌ష్టార్జితం య‌థేచ్ఛగా దోపిడీకి గుర‌వుతున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. అధికారులు చూసిచూడ‌న‌ట్లుగా ఉండ‌టానికి చిల్లర కాంటాదారుల‌కు వారికి మ‌ధ్య కుదిరిన మాముళ్ల ఒప్పందమే కార‌ణ‌మ‌ని మార్కెట్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. కోట్లాది రూపాయాల అక్రమ లావాదేవీల్లో అధికారుల‌కూ వాటాలున్నట్లు తెలుస్తోంది. దిశ‌కు చిక్కిన ఆధారాల‌ను బ‌ట్టి కూర్చన్నచోటే కుంపేసుకునే దోపిడీకి అధికారుల అండ‌దండ‌లుంటాయ‌ని సుస్పష్టమ‌వుతోంది.

ప‌త్తి పొగేసి.. చిల్లర కాంటాల‌కు అమ్మేసి..

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా ప్రఖ్యాతిగాంచిన వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్‌కు నిత్యం వేలాది మంది రైతులు పంట ఉత్పతుల‌ను విక్రయానికి తీసుకువ‌స్తుంటారు. ప‌త్తి, మిర్చితో పాటు ప‌సుపు ఇత‌ర అప‌రాలను రైతులు ఇక్కడ విక్రయిస్తుంటారు. మార్కెట్‌లో విక్రయించినందుకు గాను వివిధ రుసుములను రైతుల నుంచి మార్కెట్ అధికారులు వ‌సూలు చేస్తున్నారు. అయితే రైతుల పంట ఉత్పత్తుల కాంటాల స‌మయంలో హ‌మాలీలు ఇనాం పేరిట‌.. కూటుకు ఒక్కో రైతు నుంచి దాదాపు కేజీన్నర నుంచి రెండు కేజీల వ‌ర‌కు ఉత్పత్తులను బ‌ల‌వంతంగా.. బ‌తిమాలి తీసుకుంటున్నారు.

ఇలా హ‌మాలీలు సేక‌రించిన పంట ఉత్పత్తుల‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లోనే చిల్లర కాంటాల వ్యాపారులు సిద్ధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. రైతుల వ‌ద్ద నుంచి సేకరించిన ప‌త్తి, మిర‌ప‌తోపాటు ఇత‌ర పంట ఉత్పత్తుల‌ను చిల్లర కాంటా వ్యాపారుల‌కు మార్కెట్ రేటు త‌క్కువ‌గా విక్రయిస్తుంటారు. ప‌త్తి విష‌యానికే వ‌స్తే.. మార్కెట్‌లో కిలో రూ.70, 80లు ప‌లుకుతున్న ప‌త్తిని హ‌మాలీల వ‌ద్ద నుంచి చిల్లర కాంటా వ్యాపారులు రూ.40 లోపుగానే కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో కిలో ప‌త్తి మీద దాదాపు రూ.30ల‌కు పైగానే మిగలడం గ‌మ‌నార్హం. మిర్చి విష‌యంలో అయితే ఈ దోపిడీ అధికంగానే ఉంటుంది. ఈ మొత్తం వ్యవ‌హారం తెలిసి కూడా స‌హ‌క‌రిస్తున్న అధికారుల‌కు ఈ మిగులు లాభంలో కొంత అంద‌జేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప‌త్తి కొనుగోళ్లకు 8 చిల్లర కాంటాల‌

ప‌త్తి, మిర్చి, అప‌రాల యార్డుల్లో ఏడెనిమిది చిల్లర‌ కాంటాలు కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప‌త్తియార్డులోని చిల్లర కాంటాదారులు ఒక్కోరోజూ దాదాపు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వ‌ర‌కు కొనుగోలు చేస్తున్నట్లు స‌మాచారం. ఇలా వేలాది మంది రైతుల కోట్ల విలువ చేసే పంట ఉత్పతులు మార్కెట్లోనే దోపిడీకి గురై.. హ‌మాలీల‌కు, అక్రమ వ్యాపారుల‌కు, అధికారుల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నట్లు స‌మాచారం.

వాస్తవానికి మార్కెట్లో కొనుగోళ్లు స‌క్రమంగా జ‌రిగేలా చూసేందుకు యార్డుకు సూప‌ర్ వైజ‌ర్లు, ఇన్‌చార్జీలు ఉంటారు. మార్కెట్లో ఎలాంటి అక్రమాల‌కు తావు లేకుండా లావాదేవీలు జ‌రిగేలా చూడాల్సిన బాధ్యత కూడా మార్కెట్ అధికారులదే. కానీ ఏనుమాముల మార్కెట్లో మాత్రం అధికారుల క‌ళ్ల ముందే దోపిడీ జ‌ర‌గ‌డంతో పాటు అక్రమంగా చిల్లర కాంటాలు కొన‌సాగుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మార్కెటింగ్ శాఖ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమాలు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed