ఆన్​లైన్​ క్లాసులను ఎలా కొనసాగిస్తున్నారు ?

by  |
ఆన్​లైన్​ క్లాసులను ఎలా కొనసాగిస్తున్నారు ?
X

దిశ, న్యూస్​బ్యూరో: విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ఆన్‌లైన్ క్లాసుల‌ను ఎలా కొన‌సాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌లైన్ క్లాసులు నిషేధించాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిస్టెన్స్, ఆన్‌లైన్ ప‌ద్ధతిలోనే త‌ర‌గ‌తులు నిర్వహించాల‌ని కేబినేట్​ సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ మార్గద‌ర్శకాల‌ను జారీ చేస్తుందన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలకు వ్యతిరేకంగా పేరేంట్​ చంద్రశేఖ‌ర్ వేసిన పిటిష‌న్‌ను హైకోర్టు తిర‌స్కరించింది. పేరెంట్స్ నుంచి విడివిడిగా పిటీష‌న్లు స్వీక‌రించ‌లేమ‌ని, అలా చేస్తే వ‌ర‌ద గేట్లు తెరిచిన‌ట్టవుతుందని, భారీ సంఖ్యలో పిటిష‌న్లు వ‌స్తాయ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు దృష్టికి తీసుకురాద‌ల్చిన విష‌యం ఉంటే హైద‌రాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేష‌న్ ద్వారా తెలపాల‌ని హైకోర్టు సూచించింది.

మార్చిలోనే విద్యా సంవత్సరం మొదలైందని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు చెబుతున్నాయని హైకోర్టు పేర్కొంది. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు గంటల తరబడి ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఎలా ఉండగలరు? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజులు వసూలు చేయొద్దన్న జీఓను స్కూళ్లు ఉల్లంఘిస్తున్నాయని మరోసారి పిటిషనర్ గుర్తుచేశారు. వెంటనే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని సూచించింది. సీబీఎస్ఈ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశిస్తూ త‌దుప‌రి విచార‌ణను ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.


Next Story

Most Viewed