ఆ బోర్డు ఆస్తుల లెక్క తేల్చండి.. హైకోర్టు ఆదేశాలు

by Shyam |   ( Updated:2021-03-25 13:43:19.0  )
Telangana High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు ఎక్కడెక్కడ ఎన్ని స్థలాలు ఉన్నాయో జిల్లాలవారీగా వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని స్థలాలు కబ్జాకు గురయ్యాయో, ఆక్రమణలు జరిగాయో, నిర్మాణాలు చోటుచేసుకున్నాయో కూడా వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని జూన్ 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను బెంచ్ గురువారం విచారించింది. ఆక్రమణలకు గురైనట్లు తెలిసిన తర్వాత ఎన్నింటిని స్వాధీనం చేసుకున్నారో వివరాల్లో పేర్కొనాలని స్పష్టంచేసింది. వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,186 వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని వివరించారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందా? అందులో ఎంతమంది ఉన్నారు? అది సాధించిన ప్రగతి ఏమిటి? ఎన్ని ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది? తదితర వివరాలేలు వక్ఫ్ బోర్డు వద్ద లేకపోవడంపై బెంచ్ అసహనం వ్యక్తంచేసింది. ఈ వివరాలను జిల్లాలవారీగా పూర్తిగా నివేదిక రూపంలో రూపొందించి జూన్ 10న జరిగే తదుపరి విచారణ సమయానికి కోర్టుకు సమర్పించాలని బెంచ్ ఆదేశించింది

Advertisement

Next Story