దేవరయాంజల్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

by Anukaran |
Telangana High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేవరయాంజల్ భూములపై విచారణ జరిపే స్వేచ్ఛ ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీకి ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు ఆ భూముల్లోకి వెళ్ళే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకునేటట్లయితే వారికి ముందస్తు నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నది. ఒకవేళ పిటిషనర్లకు ఐఏఎస్ అధికారుల కమిటీకి సహకరించని పక్షంలో వారిపై చర్యలు తీసుకునే అధికారం ఆ కమిటీకి ఉంటుందని స్పష్టం చేసింది. కమిటీకి అవసరమైన ఫైళ్ళు, డాక్యుమెంట్లు, ఇతర వివరాలను పిటిషనర్లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీని నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరుతూ సదా కేశవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 1014ను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దేవరయాంజల్‌లో ఆలయ భూములను గుర్తించడానికి ఐఏఎస్ అధికారుల కమిటీ విచారణ జరిపితే వచ్చే ఇబ్బంది ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా అని హైకోర్టు నిలదీసింది. కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోవడాన్ని చట్టబద్దం చేయాలా? అందుకు వారికి అనుమతి ఇవ్వాలా అని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని స్పష్టం చేసింది.

నోటీసులు ఇవ్వకుండానే కమిటీ సభ్యులు భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్ వాదించగా, విచారణ జరిపే స్వేచ్చ కమిటీకి ఉందని స్పష్టం చేసింది. అయితే భూముల్లోకి వెళ్లే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకునేటట్లయితే ముందస్తుగా నోటీసును జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story