ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే పాఠాలు ఎలా వింటారు ?

by  |
ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే పాఠాలు ఎలా వింటారు ?
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయడంతో దీనిపై దాఖలైన పిటిషన్లను గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి విధి విధానాలను రూపొందించినట్లు తెలిపిన ప్రభుత్వం.. టీశాట్, దూరదర్శన్ ద్వారా క్లాసులు నిర్వహించనున్నట్లు వివరించింది. అయితే విద్యార్థులకు అనుమానాలు వస్తే టీవీల్లో ఎలా నివృత్తి చేసుకుంటారని హైకోర్టు ప్రశ్నించగా… సందేహాల నివృత్తికి స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం తెలిపింది. మరి కుటుంబంలో ముగ్గురు విద్యార్థులుంటే ఒకేసారి ఎలా పాఠాలు వింటారని హైకోర్టు వ్యాఖ్యానించగా… 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరు సమయాల్లో పాఠాలు ప్రసారం అవుతాయని పేర్కొంది. ప్రభుత్వ, పాఠశాలల్లో వేర్వేరు సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా… ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పైనే మా ఆందోళన అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అటు ప్రభుత్వ విధి విధానాలపై అభ్యంతరాలుంటే తెలపాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టం చేసింది.

ఫీజులు చెల్లించకుంటే అడ్మిషన్ రద్దు చేస్తున్నారని హెచ్ఎస్‌పీఏ తరపు లాయర్ వాదించగా.. ఫీజులకు సంబంధించి ఇప్పటికే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే జీవో ఉల్లంఘించిన విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించగా.. కొన్ని విద్యా సంస్థలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. పేరెంట్స్ పై బోయిన్‌పల్లి పీఎస్‌లో కేసులు పెట్టారని లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా… ఏకారణంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.


Next Story