ఖ‌మ్మంలో హై టెన్ష‌న్‌..

by vinod kumar |
ఖ‌మ్మంలో హై టెన్ష‌న్‌..
X

దిశ‌, ఖ‌మ్మం : ఖ‌మ్మం జిల్లాలో హై టెన్ష‌న్ నెల‌కొంది. సోమ‌వారం జిల్లాలో తొలి క‌రోనా వైరస్ (కొవిడ్-19) పాజిటివ్ కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. దాంతో జిల్లాలో హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది. పోలీసులు లాక్‌డౌన్ ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఎలాంటి ప‌రిస్థితులనైనా ఎదుర్కొనేందుకు స‌న్నాహకాలు చేస్తోంది. క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్లు ఏమాత్రం అనుమానం క‌లిగిన వైద్య‌సిబ్బంది స‌ద‌రు వ్య‌క్తుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70మందికిపైగా క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా ల‌క్ష‌ణాలున్న 139 మంది శాంపిళ్ల‌ను ప‌రీక్ష‌ల‌కు పంపిన‌ట్లు డీఎంహెచ్‌వో మాల‌తి తెలిపారు. ఇందులో 119 నెగిటివ్ వ‌చ్చాయ‌నీ, ఈరోజు ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చింద‌ని తెలిపారు.

జిల్లాలో పెద్ద తండావాసి క‌ద‌లిక‌లు..

పెద్ద తండావాసి మార్చి 14న ఖమ్మం నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్లాడు. 15వ తేది అక్కడే ఉన్న అంబేద్కర్‌ భవనంలో బస చేసి 16న ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఓ రాజకీయ పార్టీ అవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొంత‌మంది పార్టీ ప్ర‌ముఖుల‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు సమర్పించాడు. ఆరోజు రాత్రి అంబేద్కర్‌ భవనంలోనే బస చేసి 17న పలు ప్రాంతాల్లో పర్యటించారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరి మ‌ర్క‌జ్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఆధ్యాత్మిక స‌భ‌కు వెళ్లివ‌స్తున్న త‌బ్లీగి ప్ర‌తినిధులు ప్ర‌యాణిస్తున్న బోగీలో ఎక్కాడు. 18వ తేదీ సాయంత్రం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఖాజీపేట స్టేష‌న్‌లో దిగాడు. అక్క‌డి నుంచి శాత‌వాహ‌న ఎక్స్‌ప్రెస్‌లో ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చేరుకున్నాడు. ఖ‌మ్మంలో దిగ‌గానే మయూరి జంక్ష‌న్‌కు ద‌గ్గ‌రగా ఉన్న హోట‌ల్‌కు వెళ్లి టీ తాగాడు. అనంత‌రం ఫ్రెడ్స్‌తో క‌ల‌సి రూంకు వెళ్లాడు. 19వ తేది మ‌ర్నాడు ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని ఓ క‌ళాశాల‌కు ద‌గ్గ‌రగా ఉన్న హోట‌ల్‌లో టీతాగి, అల్ప‌హారం చేశాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ఓ డీటీపీ సెంట‌ర్‌కు ప్ర‌తుల‌కు సంబంధించిన‌ వెళ్లి ఆర్డ‌ర్ ఇచ్చారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రూంకు వెళ్లిపోయాడు. 20న‌ మ‌ర్నాడు ఓ ఉద‌యం రూంకు ద‌గ్గ‌ర‌గా ఉన్న హోట‌ల్‌లో టిఫిన్ చేశాడు. 21న స్వ‌గ్రామం పెద్ద‌తండాకు వెళ్లిపోయాడు.

పెద్దతండావాసి వచ్చాడన్న విషయం తెలుసుకున్న ఇద్ద‌రు స్నేహితులు వ‌చ్చి క‌లిశారు. 22న ఖ‌మ్మం ప‌ట్టణానికి చెందిన ఓ ముస్లిం నాయ‌కుడి సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. ఆ త‌ర్వాత 23న తిరాండ్ల గ్రామంలోని స్నేహితుడిని క‌లిసేందుకు వెళ్లాడు. 24న నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లంలోని ఓ ద‌ర్గాను సంద‌ర్శించాడు. ఏప్రిల్ 1న ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌య్యాడు. ఈనెల 2న ఢిల్లీ నుంచి త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధుల‌తో క‌ల‌సి ప్ర‌యాణం చేసిన మ‌హ‌బూబాబాద్‌కు చెందిన వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో పెద్దతండావాసి కూడా ఆ బోగీలో ఉన్న‌ట్లు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు త‌ర‌లించారు. పెద్దతండావాసికి క‌రోనా (కొవిడ్ -19) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా సోమ‌వారం వెలువ‌డిన ఫ‌లితాల్లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

పెద్దతండావాసికి ప్రముఖులతో సంబంధాలు..

ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం పెద్ద‌తండాకు చెందిన వ్య‌క్తిగా గుర్తించ‌గా, ఓ కుల సంఘంలో కీల‌కంగా ప‌నిచేయ‌డంతో పాటు రాజ‌కీయ పార్టీలోనూ ప‌నిచేస్తున్నాడు. ఆయ‌న‌కు ఖ‌మ్మంలోని ప‌లువురు ప్ర‌ముఖుల‌తో సంబంధాలు క‌లిగి ఉన్నాడ‌నే వాద‌న వినిపిస్తోంది. పెద్ద‌తండావాసితో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న వారంద‌రినీ ఇప్ప‌టికే జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఢిల్లీ వెళ్లివ‌చ్చిన అనంత‌రం పెద్ద‌తండావాసి ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన కొంత‌మంది విలేకరులనూ క‌లిసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఇద్ద‌రు విలేక‌రుల‌ను జిల్లా ఆస్ప‌త్రికి వైద్య సిబ్బంది తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. కాని ఈ విషయం వైద్యాధికారులు ధ్రువీక‌రించ‌లేదు.

తండాలో పారిశుధ్య‌ప‌నులు..

పెద్ద‌తండా వాసితో నేరుగా కలిసి మాట్లాడిన 45మంది పేర్లు ఇప్పటి వరకు సేక‌రించారు. పెద్దతండాలో కరోనా కేసు నమోదు కావడంతో బాధిత వ్యక్తి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా అధికారులు ప్ర‌క‌టించారు. పెద్దతండా చుట్టూ రాకపోకలు నిలిపేశారు. అలాగే గ్రామంలో అధికారులు పెద్ద ఎత్తున‌ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. బాధిత వ్య‌క్తి ఇంటిని మొత్తం క్రిమి నాశక ద్రావణాలతో శుభ్రం చేయించారు. ఆ వ్యక్తితో ఇటీవ‌లి కాలంలో ఎవరెవరు తిరిగారో అనే విషయం‌పై గ్రామంలో ఏఎన్‌ఎంలు సర్వే నిర్వహిస్తున్నారు. వారందరినీ క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామస్తుల ఆరోగ్య స‌మాచారాన్ని వైద్య బృందాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారుల‌కు నివేదికలు పంపుతున్నాయి.

Tags: coronavirus (covid 19), positive cases increase, high alert, lockdown

Advertisement

Next Story

Most Viewed