హీరో డీలర్‌షిప్‌లలో ఆథర్ స్కూటర్లు!

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రికల్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ఆథర్ ఎనర్జీ (Ather Energy)లో సుమారు 35 శాతం వాటాను కలిగి ఉన్న హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) త్వరలో కంపెనీలో మెజారిటీ నియంత్రణ వాటాను దక్కించుకోనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పరిశీలనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా హీరో డీలర్‌షిప్‌లలో ఆథర్ స్కూటర్లను విక్రయించే చర్యలను కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం 34.6 శాతం వాటాతో హీరో మోటోకార్ప్ ఆథర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ‘గత కొన్ని సంవత్సరాలుగా ఆథర్ కంపెనీ సాధించిన పురోగతిపై సంతృప్తిగా ఉన్నాము. అంతేకాకుండా సొంతంగా ఎలక్ట్రికల్ వెహికల్‌కు సంబంధించి పరిశోధనలు అభివృద్ధి చేస్తున్నామని’ హీరో మోటోకార్ప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాల పరంపర కొనసాగుతోంది. ఈ విభాగంలో ఇతర కంపెనీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

2013లో స్థాపించిన ఆథర్ ఎనర్జీ బెంగళూరులో ఎలక్ట్రికల్ స్కూటర్ల (Electric scooters)ను తయారుచేసి విక్రయిస్తోంది. ఇటీవల చెన్నై మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 8 నగరాల్లో ఆథర్ ఎనర్జీని విస్తరించడంపై దృష్టి సారించామని’ సంస్థ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా వెల్లడించారు.

కొవిడ్-19 (Kovid-19) కారణంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు 3-4 నెలలు ఆలస్యమైంది. రానున్న 6 నుంచి 8 నెలల్లో కొత్త మోడల్ ఆథర్ 450ఎక్స్‌ (Ather 450X)ను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తున్నాం. కార్యకలాపాలను పెంచి, డిసెంబర్ నాటికి కొత్త ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభిస్తామని తురుణ్ మెహతా తెలిపారు. 2022 నాటికి కనీసం 20 నగరాల్లో డీలర్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. హీరో మోటోకార్ప్ మొట్టమొదటిసారిగా 2016లో ఆథర్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టింది. మళ్లీ ఈ ఏడాది జులైలో రూ. 84 కోట్ల పెట్టుబడులతో 31 శాతం నుంచి 35 శాతానికి వాటాను పెంచుకుంది.

Advertisement