రక్తం లేకుండానే హిమోగ్లోబిన్ పరీక్ష?

by  |
రక్తం లేకుండానే హిమోగ్లోబిన్ పరీక్ష?
X

రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తెలుసుకోవాలంటే రక్తం బయటికి తీసి పరీక్షించాలి. అయితే అలా కాకుండా రక్తం అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్, కనురెప్పల ఫొటోల ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని తెలిపే పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనివల్ల సంబంధిత పేషెంటు ఆసుపత్రికి రాకుండానే రక్తపరీక్ష చేయించుకోవచ్చు. అంతేకాకుండా విషమ పరిస్థితిలో ఉన్నవారు, సరైన ల్యాబ్ సౌకర్యాలు లేని దేశాల్లో ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ మొబైల్ ఆధారిత టెస్టు ద్వారా అనీమియా, కిడ్నీ జబ్బులు, హెమరేజ్ వంటి ఇతర రక్త సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవచ్చని రీసెర్చీ టీమ్ లీడర్ యంగ్ కిమ్ అన్నారు. పర్డ్యూ యూనివర్సిటీ చేస్తున్న ఈ పరిశోధన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొవిడ్ 19 విపత్తు తర్వాత టెలీమెడిసిన్, మొబైల్ హెల్త్ టెస్టింగ్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను పరిశోధకులు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజర్‌గా మార్చారు. దీంతో ఎలాంటి హార్డ్‌వేర్ లేకుండానే హిమోగ్లోబిన్ స్థాయిని కొలవవచ్చు. మోయ్ యూనివర్సిటీలో వాలంటీర్ల మీద దీన్ని ప్రయోగిస్తే, రెగ్యులర్ టెస్టు కంటే 5 నుంచి 10 శాతం మాత్రమే ఫలితాల్లో తేడా కనిపించినట్లు వారు తెలిపారు. హిమోగ్లోబిన్ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగించే స్పెక్ట్రోస్కోప్ విశ్లేషణను స్మార్ట్‌ఫోన్‌కి అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైందని కిమ్ తెలిపారు. ఇంకా కొన్ని సవరణలు చేయడం ద్వారా దీన్ని క్లినికల్ స్థాయిలో ఉపయోగించే వీలు ఉంటుందని అన్నారు.


Next Story

Most Viewed