- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షంతో భాగ్యనగరం కకావికలం
దిశ ప్రతినిధి , హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రాత్రి ఉద్యోగం, వ్యాపారం ముగించుకుని ఇండ్లకు చేరుతున్న ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచి చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాత్రి 8 గంటల సమయంలో మొదలై మూడు గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మొత్తం మీద రాత్రి సమయంలో కురిసిన వర్షం నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, గాజుల రామారాం, హైటెక్ సిటీ, మాసట్ ట్యాంక్, కోఠి, నాంపల్లి, మలక్‌పేట్, కొత్తపేట, చంపాపేట్, కర్మన్‌ఘాట్ , ఎల్బీనగర్, చందానగర్, మల్లాపూర్, లక్డీకాపూల్ , పంజాగుట్ల , అబిడ్స్ , మాదాపూర్, హైటెక్ సిటీ , అమీర్ పేట్, బేగంపేట, మాదాపూర్, ప్రకాష్ నగర్, కొండాపూర్ , కూకట్‌పల్లి తదితర ప్రాంతాలలో వర్షం బీభత్సానికి వాహనాలు ఎక్కడిక్కడే రోడ్లపై నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలలో వరద నీరు అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లను ముంచెత్తింది. రాత్రి మొత్తం భారీ వర్షం కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే డీఆర్ఎఫ్ ఫోన్ నెంబర్ 040-29555500 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.
పడవల్లా నీటిపై తేలిన వాహనాలు..
గ్రేటర్ పరిధిలో కుండపోతగా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలలో రోడ్లపై వరద నీరు చేరింది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాలలో ఇండ్ల ముందు, రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. కూకట్‌పల్లిలో ద్విచక్ర వాహనాలు, కార్లు, పండ్లు, కూరగాయల బండ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. కృష్ణానగర్‌లో ఓ దుకాణం ముందు నిలబడి ఉన్న వ్యక్తి నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు .
నమోదైన వర్షపాతం
కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, షేక్‌పేట్, యూసుఫ్‌గూడలలో 7 సెంటీమీటర్లు , ఖైరతాబాద్ , శ్రీనగర్‌కాలనీ, రంగారెడ్డినగర్, బాలానగర్, గాజుల రామారంలలో 6 సెంటీమీటర్లు , బాలానగర్ 6.8, శ్రీనగర్ కాలనీ 5.8 సెంటీమీటర్లు , కుత్బుల్లాపూర్ 5.7 సెంటీమీటర్లు , మూసాపేట్, మాదాపూర్ 4.5 సెంటీమీటర్లు , కాప్రా 3.1 సెంటీమీటర్లు , అల్వాల్, మూసాపేట్ 2 సెంటీమీటర్లుగా నమోదైంది.