అభివృద్ధి అంటే ఇదేనా.. సిద్దిపేట ప్రజల ఆగ్రహం

by Shyam |   ( Updated:2023-06-13 16:21:18.0  )
Heavy-rain,-Siddipet
X

దిశ, సిద్దిపేట: అభివృద్ధికి కేరాఫ్ సిద్దిపేట అని చెప్పుకునే నేతలు, అధికారులు ఇప్పుడేమంటారు. సిద్దిపేట ప్రధాన వీధులు, రోడ్లు, అధికారిక కార్యాలయాలు చూసిన ప్రతిఒక్కరూ అభివృద్ధిలో దేశానికే సిద్దిపేట ఆదర్శం అంటూ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు చూపిస్తున్నారు. కానీ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు జీవించే కాలనీలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నాయనడానికి నిదర్శనం ఇవి చాలావా..? అభివృద్ధి అంటే సుందరమైన భవనాలు, పార్కులు, చెరువులు, రోడ్లు కావు సామాన్య మధ్యతరగతి బతుకులలో మార్పు. గర్వంగా ఆ కుటుంబాలు బతికినప్పుడే అభివృద్ధి అని ఆ కాలనీ వాసులు అభిప్రాయ పడుతున్నారు. సిద్దిపేట అంటే అభివృద్ధికి అని చెప్పుకునే నేతలు ఆ కాలనీని చూసి సిగ్గు పడండంటూ ఆ కాలనీవాసులు విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్మాణం జరుగుతున్నాయంటూ ఉన్న రోడ్లు తవ్వి గుంతలమయం చేసి రోడ్లు వేయడంలో జాప్యం చేస్తూ వచ్చారు. అయినా.. అభివృద్ధి జరుగుతుందని మౌనంగా ఉన్నాం. కానీ నేడు కురిసిన వర్షానికి బయట కాలు పట్టలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని నివాసాల్లోకి వర్షం నీరుచేసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చెరువులు, కుంటలను తలపించిన కాలనీలు

సిద్దిపేటలోని నాసర్‌పూర, పారుపల్లి వీధి, శివాజీ సగర్‌తో పాటు పలు కాలనీల్లో ఆదివారం కురిసిన వర్షంతో పలు కాలనీలు చెరువులు, వాగులను తలపించాయి. ఆ కాలనీలో నివాసం ఉంటున్న పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదీ ఇదే పరిస్థితి ఉండగా పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని, మళ్లీ వర్షంతో అదే సీన్ రిపీట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట అభివృద్ధి ప్రచారంపై విమర్శల చేస్తున్నారు. గొప్పలు చేప్పుకునేటోల్లు ఇక్కడ ఉండి గొప్పలు చెప్పాలని విమర్శలు చేస్తున్నారు. భారత్ నగర్‌లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. మంత్రి హరీశ్ రావు నివాసానికి పక్కనున్న భారత్ నగర్ నుంచి పాత బస్టాండ్‌కు వెళ్లే రహదారిలో పాటు పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి నివాసం వద్దే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలా అంటు స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

జలమయమైన ఇండ్లు

సిద్దిపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు జలమయ్యమయ్యాయి. చీకటి పడటం.. వర్షం నిరంతరంగా పడటంతో ఇండ్లలో నీరుచేరి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా వుండగా సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వారు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్ని జలమయం కావడం.. రోడ్ సరిగా లేకపోవడంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.

తూతూ మంత్రంగా పనులు

ఇలాంటి వర్షాలు పడి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సమయంలో అధికారులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. జేసీబీలు తెచ్చి మురుగు కాల్వలు క్లీన్ చేస్తారు. రోడ్డులను తాత్కాలికంగా రిపేర్ చేస్తారు. అంతే తప్పా.. సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపరు. మళ్ళీ చిరు జల్లులకే రోడ్లన్నీ చిత్తడి కావాల్సిందే. చేసిన పనులు ప్లాన్‌గా చేపట్టకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్క ప్లాన్ ప్రకారం చేపట్టకపోవటంతో వర్షం నీరు ప్రవహించే ప్రధాన కాలువ ఎత్తుగా ఉండటం దానికి అనుసంధానంగా నిర్మించిన కాలువ సమాంతరంగా నిర్మించకపోవటంతో సమస్య తలేత్తుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలోని సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.

అభివృద్ధిపై అధికార పార్టీ నాయకుల ఆగ్రహం

సిద్దిపేటను అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటుగా ఉందంటూ పలువురు టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారులు సుందరంగా ఉంటే సరిపోదు.. అన్ని కాలనీలు, ప్రజలు బాగున్నప్పుడే అభివృద్ధి అంటారు. కానీ ఇలా పరిస్థితులు ఉంటే అభివృద్ధి అంటారా..? అంటూ అధికార పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అభివృద్ధి పనులు నాణ్యతగా చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story