నిండుకుండల్లా జలాశయాలు

by Shyam |
నిండుకుండల్లా జలాశయాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఎగువ నుంచి దిగువ దాకా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు దాకా లక్షకుపైగా క్యూసెక్కులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో వస్తుండగా… ఎగువ నుంచి పులిచింత ప్రాజెక్టు దాకా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు సోమవారం రాత్రి వరకు 1.30 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 1.09 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.80 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1.09 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎగువ ప్రాజెక్టులకు కొంత మేరకు ఇన్ ఫ్లోలు తగ్గినా అవుట్ ఫ్లోలను కొనసాగిస్తున్నారు. జూరాల జలాశయానికి 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో ఉండగా… 1.96 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 1.87 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా… నీటిమట్టం 108 టీఎంసీలకు చేరింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని కొనసాగిస్తూ సాగర్‌కు 38వేల క్యూసెక్కులను వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం ప్రస్తుతానికి 234 టీఎంసీలుగా ఉంది. 38వేల పైచిలుకు ఇన్ ఫ్లో ఉంటుంది.

బేసిన్‌లో వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి దిగువ వరకూ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక గోదావరి బేసిన్ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల ద్వారా గోదావరి జలాల తరలింపు కొనసాగుతోంది. లింక్ -1లోని మోటార్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల చొప్పున ప్రాణహిత జలాలను ఎల్లంపల్లికి తరలిస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం ప్రస్తుతం 9.95 టీఎంసీల నిల్వకు చేరింది. దీంతో నంది మోటారు ద్వారా ఎగువకు 16వేల క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. దీంతో శ్రీ రాజ రాజేశ్వర జలాశయానికి 15వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. మరోవైపు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల వరద వస్తుంది.

Advertisement

Next Story