ఆలేరులో హృదయ విదారక ఘటన..!

దిశ వెబ్‎డెస్క్:

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర తేడాలో తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ మడేలు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తన భార్య మమత అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఇద్దరు పిల్లలను మడేలు చూసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాక గుండెపోటు రావడంతో మడేలు మృతి చెందాడు. తండ్రి హఠాన్మరణంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

లే నాన్నా.. ఆకలేస్తోంది.. అంటూ తండ్రి మృతదేహం వద్ద అడుగుతున్న చిన్నారులను చూసి అక్కడికి వచ్చిన వారిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పందించారు. చిన్నారుల సంరక్షణ బాధ్యత మహిళ శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

Advertisement