వామ్మో.. వ్యాక్సిన్

by sudharani |
వామ్మో.. వ్యాక్సిన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాక్సిన్ అంటేనే హెల్త్ కేర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. తెలంగాణలోనూ పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. తొలి డోస్ తీసుకున్నవారు రెండో డోస్ తీసుకోడానికి వెనకాడుతున్నారు. ఫస్ట్ టైమ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొద్దిమంది అనారోగ్యం బారిన పడడం, మరికొందరు చనిపోవడం వీరిని భయపెడుతోంది. వ్యాక్సిన్ కారణంగా చనిపోయారనేది అపోహ మాత్రమేనని వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్య నిపుణులు చెబుతున్నా.. హెల్త్ కేర్ సిబ్బందిలో మాత్రం భయాలు అలానే ఉన్నాయి. అందుకే రెండో డోస్ తీసుకోడానికి ముందుకు రావడంలేదు. ఫస్ట్ డోస్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. వ్యాక్సిన్ పనిచేసినా చేయకపోయినా రెండో డోస్‌ తీసుకోడానికి మాత్రం సిద్ధపడడంలేదు.

దేశం మొత్తం మీద గత నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రెండు రోజుల్లో దేశం మొత్తం 2,08,253 మంది తొలి డోస్ టీకాలు తీసుకున్నారు. వీరికి రెండో డోస్ 28 రోజుల తర్వాత ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమైంది. లెక్క ప్రకారం తొలి డోస్ తీసుకున్నవారంతా రెండో డోస్ తీసుకోవాలి. కానీ సగానికంటే ఎక్కువ మందే ముఖం చాటేశారు. కేవలం 98,118 మంది మాత్రమే రెండో డోస్ టీకాలు తీసుకున్నారు.

తెలంగాణ విషయాన్ని చూసుకుంటే గత నెలలో మొదటి రెండు రోజుల్లో 17,528 మంది ఫస్ట్ డోస్‌ను తీసుకున్నారు. కానీ అందులో 14,128 మంది మాత్రమే రెండో డోస్ తీసుకున్నారు. చాలా మంది రెండో డోస్ తీసుకోడానికి ఇష్టపడడంలేదు. రకరకాల కారణాలు చెప్పి ఎగ్గొడుతున్నారు. వ్యాక్సిన్ పట్ల ఉన్న భయమే ఇందుకు కారణం.

అనారోగ్యంగా ఉందని, స్వల్పంగా జ్వరం వచ్చిందని, జలుబు చేసిందని, లీవ్‌లో ఉన్నామని… ఇలా అనేక కారణాలను చెప్తూ రెండో డోస్ తీసుకోడానికి హెల్త్ కేర్ సిబ్బంది వెనకాడుతున్నారు. తొలి డోస్‌గానీ, రెండో డోస్‌గానీ తీసుకున్న తర్వాత స్వల్పంగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు రావడం ఇందుకు కారణం. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నలుగురు చనిపోయారు. మృతికి వ్యాక్సిన్ కారణం కాదని వైద్యారోగ్య శాఖ సిబ్బంది చెప్తున్నా హెల్త్ కేర్ వర్కర్లలో మాత్రం గుబులు ఎక్కువగానే ఉంది.

తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 2.79 లక్షల మంది తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బంది దాదాపు 2.89 లక్షల మంది ఉన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందిలాంటి వారంతా కలుపుకుని ఫ్రంట్ లైన్ వర్కర్లు దాదాపు నాలుగు లక్షల మందికిపైగానే ఉన్నారు. కానీ ఇందులో మూడు లక్షల మంది మాత్రమే ‘‘కొవిన్‘ సాఫ్ట్‌వేర్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో పావు వంతు మంది కూడా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. మొత్తం ఏడు లక్షల మంది హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లలో సగం మంది కూడా తొలి డోస్ తీసుకోలేదు. ఇక రెండో డోస్ ప్రక్రియ ముగిసేనాటికి ఎంత మంది టీకాలు తీసుకుంటారనేది అనుమానమే.

Advertisement

Next Story

Most Viewed