భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ ప్రయాణానికి కనీసం మూడు రోజుల ముందు(72గంటలు) సెల్ఫ్-డిక్లరేషన్‌ను www.newdelhiairport.in పోర్టల్‌లో సమర్పించాలి. భారత్‌లో అడుగుపెట్టినాక ఏడు రోజులు సొంత ఖర్చులపై ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లలో ఉండాలి. తర్వాత ఏడు రోజులు ఇంట్లో హోం ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది.

గర్భిణీలు, తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలున్నవారికి, కొన్ని అనివార్య కారణాలున్నవారికి మాత్రం 14 రోజుల హోం క్వారంటైన్‌కు అనుమతి ఉంది. దీనికోసం బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే వివరాలు అందించాలి. లేదా ప్రయాణానికి 96గంటల ముందు నిర్వహించిన కరోనాపరీక్షలో నెగెటివ్ వచ్చిన రిపోర్టు సమర్పిస్తే క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందవచ్చు.

బోర్డింగ్‌కు ముందు థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. లక్షణాలు లేకుంటేనే ప్రయాణానికి అర్హులు. మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ప్రయాణంలోనూ సామాజిక దూరం, మాస్క్ ధారణలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గమ్యం చేరినాక నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తారు. విమాన, షిప్పుల ప్రయాణంతోపాటు భూమిపైనా సరిహద్దు దాటే ప్రయాణికులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది.

Advertisement