ఇకపై లక్షణాలు ఉంటేనే టెస్టులు

by  |
ఇకపై లక్షణాలు ఉంటేనే టెస్టులు
X

– వచ్చే నెల 8 కల్లా పాజిటివ్ కేసులే ఉండవ్: మంత్రి ఈటల

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరుకుంది. ఇప్పటికే 332 మంది డిశ్చార్జికాగా మంగళవారం మరో 42 మంది చికిత్స అనంతరం ఇళ్లకు చేరుకోవడంతో రాష్ట్రంలో ఇక 610 మాత్రమే యాక్టివ్ పాజిటివ్
పేషెంట్లు ఉన్నారని’’ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ,ఒక రోజు వ్యవధిలో 150 మందికి పరీక్షలు నిర్వహిస్తే కేవలం ఆరుగురు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారని తెలిపారు. ఇకపైన లక్షణాలు ఉంటే మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని అన్నారు. చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయనీ, కానీ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే టెస్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్క పాజిటివ్ పేషెంట్ ఉన్నట్లు తెలిసినా ప్రైమరీ కాంటాక్టులోని వారిని గుర్తించి ఆరోగ్య
పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, ఇప్పటివరకు రాష్ట్రంలో 19,063 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గత కొన్ని రోజులుగా కొత్తగా పుట్టుకొస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉన్నదనీ, త్వరలోనే జీరో కేసుల స్థాయికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెల 8వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులకు చికిత్స పూర్తయ్యి పేషెంట్లు ఇళ్లకు వెళ్ళిపోతారన్నారు. ఆ తర్వాత మళ్లీ సాధారణ జనజీవనం ప్రారంభమవుతుందనే భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట, వికారాబాద్, గద్వాల తదితర జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయనీ, గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు రాని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రెండు వారాల వ్యవధిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాని ప్రాంతాలను కంటైన్‌మెంట్ జాబితా నుంచి ఎత్తేస్తున్నట్లు తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 5 పాజిటివ్ కేసులు వచ్చినా కంటైన్‌మెంట్ అవసరం లేదనే నిబంధన ఉన్నప్పటికీ రిస్కు తీసుకోరాదన్న ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే కంటైన్‌మెంట్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 25 మంది కరోనా కారణంగా చనిపోయారనీ, ఇకపైన అలాంటి మరణాలు ఉండవనే భావిస్తున్నట్లు చెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లలో పాజిటివ్ కేసులు బయటటపడిన దగ్గర ప్రైమరీ కాంటాక్టులోనివారికి వైద్య సిబ్బంది క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని గుర్తుచేశారు.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నదనీ, కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా కుటుంబాల సంఖ్య మాత్రం చాలా తక్కువని, కారణం ఒకే కుటుంబంలో ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని వివరించారు. ఉదాహరణకు మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చినవారి సంఖ్య 1,281 మందిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందనీ, అందులో 1,244 మంది వివరాలను ఇంటెలిజెన్స్ పోలీసులు తొందరగానే గుర్తించారని, వారి ద్వారా వైరస్ సోకినవారందరికీ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినవారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్య రంగంలో కేరళ తర్వాత మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ అని నిర్ధారణ అయినా వైద్య చికిత్స అవసరం లేకపోతే ‘హోం క్వారంటైన్’లోనే ఉండవచ్చని, కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పేషెంట్ల ఆర్థిక, సామాజిక స్థితిగతులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పేద పేషెంట్ అయినట్లయితే ఇంట్లో హోం క్వారంటైన్ లాంటి వసతి ఉండకపోవచ్చనీ, అందుకే ఆస్పత్రిలోనే ఉంచుతున్నట్లు తెలిపారు. నిజానికి ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం పాజిటివ్ పేషెంట్లను హోం క్వారంటైన్‌కు పంపితే చివరకు గాంధీ ఆస్పత్రిలో పదిమంది కూడా మిగలరని అన్నారు.

కరోనా కారణంగా మృతిచెందినవారిలో చాలా మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి అడ్వాన్స్‌డ్ స్టేజీకి వెళ్లినవారు, హైపర్‌టెన్షన్ సమస్య ఉన్నవారు, కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు.. ఇలా చాలామంది చనిపోవడానికి కారణాలు ఇవేనన్నారు. పాతికమంది మృతుల్లో ఎనిమిది మంది మహిళలు. ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడినవారే అయినా పది మంది మాత్రం అరవై ఏళ్ల వయసులోపు వారు. 35 ఏళ్ల మహిళ మాత్రం క్యాన్సర్ వ్యాధి కారణంగా చనిపోయినా కరోనా పాజిటివ్ కావడంతో ఆమెను కరోనా మృతుల జాబితాలో చేర్చింది ప్రభుత్వం. మృతుల్లో 14 మందికి డయాబెటిస్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ విశ్లేషణలో తేలింది. 13 మందికి హైపర్‌టెన్షన్ కూడా ఉంది. ఈ రెండూ కలిసి ఉన్నవారు కూడా పది మంది ఉన్నారు. ముగ్గురు ఊపిరితిత్తుల సమస్య కారణంగా చనిపోతే ఒకరు మాత్రం న్యూమోనియాతో చనిపోయారు.

Tags: Telangana, Corona, Positive, ICMR, Deaths, Diseases, May 8, Containment Zones

Next Story

Most Viewed