నష్ట నివారణ చర్యలు షురూ!

దిశ, న్యూస్‌బ్యూరో: సర్కారు ఆసుపత్రుల్లో అందుతున్న కరోనా చికిత్సపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, వస్తున్న విమర్శలకు విరుగుడుగా స్వయంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు నడుం బిగించారు. కరోనా తొలికేసు వచ్చిన్పపుడు గాంధీ ఆసుపత్రిలోకి వెళ్ళి పేషెంట్లతో నేరుగా మాట్లాడిన ఈటల రాజేందర్ ఇప్పుడు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ఐసీయూలో, వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లతో ముఖాముఖి సంభాషించారు. వారికి అందుతున్న వైద్య చికిత్సపైనా, లభిస్తున్న భోజనం, కల్పిస్తున్న సౌకర్యాలు తదితరాలన్నింటిపై నేరుగా పేషెంట్ల నుంచే అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆగస్టు 10వ తేదీకల్లా నగరంలోని పలు ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.

సర్కారు దవాఖానలు ఉండగా కార్పొరేట్ ఆసుపత్రులకు వద్దు : ఈటల

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని నిలువరించడానికి ఒకవైపు చర్యలు చేపడుతూనే అక్కడి కంటే మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నాయని, కరోనా సోకిన ప్రజలు నిర్భయంగా ప్రభుత్వ ఆసుపత్రులకు రావచ్చని, అన్ని సౌకర్యాలూ ఉన్నాయని మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇంజెక్షన్లు లేవంటూ చేతులెత్తేస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతీ రోగికి అత్యాధునిక వైద్యం, ఖరీదైన మందుల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను పలకరించి వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నానని, అక్కడి వైద్య సౌకర్యాలు, ఉపకరణాలు తదితరాలన్నింటి గురించి టిమ్స్ నిర్వాహకులతో మాట్లాడానని తెలిపారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. కరోనాకి అందిస్తున్న వైద్యానికి పది వేల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదని, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులకు వెళ్ళాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య చికిత్స, వైద్య పరీక్షల గురించి డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్‌ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది రోజులో ఎన్నిసార్లు వస్తున్నారు? వారందిస్తున్న చికిత్సా విధానం ఎలా ఉంది? పేషెంట్లకు ఇస్తున్న భోజనం ఎలా ఉంది? సిబ్బందికిగానీ పేషెంట్లకుగానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని పేషెంట్లను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గచ్చిబౌలి ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లంతా యుక్త వయసువారు కావడంతో మరింత ధైర్యంగా పనిచేయాలని మంత్రి వారిని కోరారు. ఆక్సిజన్ సదుపాయం గురించి పరిశీలించడంతో పాటు డైరెక్టర్‌తో మాట్లాడిన మంత్రి ఈటల ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని, త్వరలోనే లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం వస్తుందని సూచించారు.

ఒక రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌ని ప్రత్యేకంగా సిబ్బంది సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకే కేటాయించాలని, ఆసుపత్రిలో ఆక్సిజన్ లాంటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లోపం లేకుండా చూసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆమెకు సూచించారు. ‘టిమ్స్’లో 1035 బెడ్స్ అందుబాటులో ఉన్నందున వీలైనంత ఎక్కువ మందికి చికిత్సఅందించే ప్రయత్నం చేయాలని, ఏ పేషెంటునూ తిప్పి పంపవద్దని నొక్కిచెప్పారు. అదనపు డాక్టర్లను నియమించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్‌రెడ్డిని ఆదేశించారు.

Advertisement