కరోనా.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ?

by  |
కరోనా.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ?
X

దిశ, న్యూస్ బ్యూరో:

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘హెల్త్ ఎమర్జెన్సీ’ని అమలు చేయడంపై కసరత్తు చేస్తోంది. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఏరోజుకారోజు విశ్లేషిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ పిలుపునకు అన్ని రాష్ట్రాలూ సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అయినా ప్రతీ రోజు సగటున 65 కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో దీన్ని పూర్తిస్థాయిలో అరికట్టడానికి ‘హెల్త్ ఎమర్జెన్సీ’ అమలు చేయడమే శ్రేయస్కరంగా భావిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రాత్రి చేసే ప్రసంగం ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఢిల్లీ నగరంలో కాలుష్యం పెరిగిపోయినప్పుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే హెల్త్ ఎమర్జెన్సీ అమలైంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా మొత్తం దేశమంతటా ఇది అమలులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఏమవుతుంది?

  • అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వాధీనంలోకి వెళతాయి.
  • బహిరంగ ప్రదేశాల్లో జన సంచారం పూర్తిగా నిలిచిపోతుంది.
  • ఆరోగ్యపరమైన అత్యవసర సేవలు, నిత్యావసరాలకు అవసరమయ్యే కదలికలు తప్ప ప్రజలు ఇండ్లకు మాత్రమే పరిమితమవుతారు.
  • బ్రిటీషు కాలంలో ఉనికిలోకి వచ్చిన 1897 నాటి ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం అనేక అంశాల్లో జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు విస్తృతాధికారాలు సంక్రమిస్తాయి.
  • ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై న్యాయస్థానాలకు సమీక్ష కోసం వెళ్ళే అవకాశమూ ఉండదు.
  • స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రాంతం మొత్తాన్ని జన సంచారం లేని నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్‌కు సంక్రమిస్తుంది.
  • పోలీసులు సైతం పరిస్థితికి తగిన తీరులో ‘యాక్ట్ 30’ని అమలుచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు 144 సెక్షన్, కర్ఫ్యూ లాంటివి ఎప్పుడైనా అమలులోకి రావచ్చు.

ఇదే మొదటిసారి..

దేశంలో ఈ తరహా వాతావరణం నెలకొనడం ఇదే ప్రథమం. గతంలో కలరా, మసూచి, ప్లేగు లాంటి ఎన్నో వ్యాధులు విస్తృతంగా వ్యాపించినా అప్పటి వాతావరణ పరిస్థితులు, జనాభా, జనసాంద్రత, పట్టణీకరణ తదితరాల నేపథ్యంలో భిన్నమైన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ‘గ్లోబల్ ప్రపంచం’లో దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీ అమల్లోకి రావడం నేటి తరాలకు ఇదే మొదటి అనుభవంగా ఉంటుంది. దాదాపు 30 రాష్ట్రాల్లో కరోనా కారణంగా ‘లాక్ డౌన్’ అమలవుతోంది. అత్యవసర సర్వీసులు మినహా మిగిలినవన్నీ ఎక్కడికక్కడ స్థంభించిపోయాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ను అమల్లోకి తేకుండానే దాదాపు ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది.

అన్ని రాష్ట్రాలూ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అయినా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, ప్రజలు రకరకాల కారణాలతో రోడ్లమీదకు వస్తుండడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడం సవాలుగా మారింది. హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తే తప్ప పరిస్థితిని అదుపులోకి తేలేమన్న అభిప్రాయంతో ఏకకాలంలో దేశమంతా దీన్ని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కరోనా విషయంలో మీడియా పోషిస్తున్న పాత్రను ప్రశంసించిన ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ మీడియా, పత్రికల పెద్దలతో వరుసగా రెండు రోజులుగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రసార మాధ్యమాల సహాయ సహకారాలను తీసుకున్నారు.

రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి లేఖ

కరోనా విషయంలో అన్ని రాష్ట్రాలూ తీసుకోవాల్సిన కనీస చర్యల విషయంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నాలుగు రోజుల క్రితం ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. జనతా కర్ఫ్యూకు కేంద్రం ఆశించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. అయినా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు మంగళవారం మరో లేఖ రాశారు.

కరోనా పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి వస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లకు తగిన చికిత్స అందించే విధంగా మెకానిజంను సిద్ధం చేసుకోవాలని తాజా లేఖలో స్పష్టం చేశారు. ఏయే ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వైద్య ఉపకరణాల లభ్యత ఎలా ఉంది, వైద్య సిబ్బంది ఏ స్థాయిలో ఉంది తదితరాలన్నింటినీ లోతైన సమాచారాన్ని సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. వాటికి అనుగుణంగా అత్యవసర సమయాల్లో ఆయా ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.

విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చిన వారెంతమంది, క్వారంటైన్‌లోనే ఉన్నారా లేక బైట తిరుగుతున్నారా, వారి ద్వారా ఎవరెవరికి లక్షణాలు అంటుకున్నాయో తెలుసుకోవడం, వారి కారణంగా పాజిటివ్ పేషెంట్లు ఎంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు లాంటి వివరాలన్నింటినీ రాష్ట్రాలను అడిగారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందించడానికి ఏయే ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డుల సౌకర్యం ఉంది, అత్యవసర సమయాల్లో కావాల్సిన వైద్య పరికరాలు ఏ మేరకు ఉన్నాయి తదితరాలన్నింటినీ సేకరించి ఆన్‌లైన్ ద్వారా కేంద్రానికి సమర్పించాలని ఆ లేఖలో రాజీవ్ గౌబ కోరారు.

ప్రైవేటు ఆసుపత్రులకు సూచనలు

అత్యవసరమైనవి తప్ప మిగిలిన సర్జరీలన్నింటిని వాయిదా వేసుకోవాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య విభాగంలో పనిచేసే ప్రభుత్వ సిబ్బందికి సెలవులను పూర్తిగా రద్దు చేసింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న ఆసుపత్రిలన్నింటికీ పాతిక చొప్పున బెడ్‌లను రిజర్వు చేయాల్సిందిగా ట్రస్ట్ సీఈఓ ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఓపీలను రద్దు చేయాల్సిందిగా సూచించారు. చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రం కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Tags: Telangana, India, PM Modi, Health Emergency, Corona, Article 352, CM KCR, private hospitals



Next Story

Most Viewed