అత్యున్నత యూనివర్సిటీల్లో హెచ్​సీయూ సెకండ్​

దిశ, న్యూస్​బ్యూరో: దేశంలోని అత్యున్నత యూనివర్సిటీల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్​ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది. 2019, 2020 ఏడాదిల్లోనూ హెచ్​సీయూ వరుసగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇండియా టుడే మార్కెటింగ్ అండ్ డెవలప్​మెంట్​ రీసెర్చ్​ అసోసియేట్స్​ (ఎండీఆర్​ఏ) నిర్వహించిన ఈ సర్వేలో జేఎన్​యూ మొదటిస్థానంలో నిలవగా.. హెచ్​సీయూ రెండో స్థానంలో నిలిచింది. ఇండియా టుడే సర్వేల్లో హెచ్​సీయూ 2017 లో ఐదో స్థానం, 2018 లో మూడో, 2019లో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని యూనివర్సిటీల్లోని సాధారణ, టెక్నికల్​, మెడికల్​, లీగ్​.. నాలుగు అంశాలను పరిశీలించి ర్యాంకులు కేటాయించారు.

ఇండియా టుడే ఉత్తమ యూనివర్సిటీల సర్వేలో భాగంగా జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన 155 విద్యాసంస్థలతో కలిపి మొత్తం 995 యూనివర్సిటీలను పరిగణలోకి తీసుకున్నారు. చివరకు 130 యూనివర్సిటీలకు ర్యాంక్​లు కేటాయించారు. ఎండీఆర్​ఏ 120రకాల మౌలిక అంశాల ప్రశ్నలను రూపొందించారు. అకాడమిక్​, అడ్మినిస్ట్రేషన్​, రీసెర్చ్​, మౌలిక సదుపాయాలు, లీడర్​షిప్​, కెరీర్​, జాబ్​ ప్లేస్​ మెంట్​ విషయాల ఆధారంగా యూనివర్సిటీల ర్యాంకింగ్స్​ కేటాయించారు. 32నగరాల్లోని 32మంది వీసీలను, 75మంది డైరక్టర్లు / రిజిస్ట్రార్స్​, 193 మంది సీనియర్​ ప్రొఫెసర్లు/ హెచ్​ఓడీలను కలిపి మొత్తం 300 మందిని సర్వేలో భాగం చేశారు. 2019 డిసెంబర్​ నుంచి 2020 జూలై వరకూ నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను ఇండియా టుడే ప్రకటించింది.

మరింత మెరుగుపడేందుకు అవకాశం
– పి. అప్పారావు, వైస్​ ఛాన్స్​లర్​, యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​

మూడేళ్ల నుంచి సర్వే ర్యాంక్​ల్లో యూనివర్సిటీ స్థానం ఎగబాకుతోంది. ఈ సారి రెండో స్థానంలో నిలిచింది. పనితీరును మెరుగుపరుచుకునేందుకు సర్వే ర్యాంకింగ్స్​ ఛాలెంజ్​ విసురుతుంది. పనితీరు, పరిశోధనల్లో మరింత మరింత వృద్ధిని కొనసాగిస్తామని నమ్మకం ఉంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై యూనివర్సిటీ దృష్టి సారిస్తుంది, ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్‌లోకి చేరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.

Advertisement