అంచనాలను అందుకోని హెచ్‌సీఎల్ టెక్

by Harish |
అంచనాలను అందుకోని హెచ్‌సీఎల్ టెక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి నికర లాభాలు 9.4 శాతం పెరిగి రూ. 3,213 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2,935 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం రూ. 17,842 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ. 20,068 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక పరంగా చూస్తే మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి లాభాలు 8.5 శాతం, ఆదాయం 2.2 శాతం పెరిగింది. అయితే, టెక్ దిగ్గజ కంపెనీ అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది.

‘కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా సంస్థ తన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులను రక్షించేంద్కు తీవ్రంగా కృషి చేసింది. యుద్ధప్రాతిపదికన విస్తృతమైన సహాయాన్ని వారికి అందించామని, ఉద్యోగులు, తమ క్లయింట్లు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేశారని, అందుకే స్థిరమైన వృద్ధి సాధించినట్టు’ హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సి విజయకుమార్ అన్నారు. రానున్న త్రైమాసికాల్లో మరింత వృద్ధిని సాధించడంపై విశ్వాసం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం త్రైమాసికంలో 37 శాతం వార్షిక వృద్ధితో 7,500 నియామకాలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. సంస్థ ఒక్కో షేర్‌కు రూ. 6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా, సోమవారం హెచ్‌సీఎల్ టెక్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ ధర 0.47 శాతం తగ్గి రూ. 1,000.20 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed