హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం రూ. 3,982 కోట్లు

by Harish |
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం రూ. 3,982 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 31.1 శాతం వృద్ధితో రూ. 3,982 కోట్లుగా వెల్లడించింది. త్రైమాసిక ప్రాతిపదిక ఇది 26.7 శాతం వృద్ధి అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 18,135 కోట్లుగా నమోదైంది. ‘మూడో త్రైమాసికంలో కంపెనీ బలమైన ఆర్థిక పనితీరును నమోదు చేసింది. డిజిటల్, క్లౌడ్ వంటి విభాగాలు పటిష్ఠంగా ఉండటంతో ఈ మెరుగుదలను సాధించగలిగామని’ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి విజయకుమారు చెప్పారు. 2020లో 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని దాటినట్టు ఆయన పేర్కొన్నారు. సంస్థకు ఇది కీలకమైన మైలురాయి. సంస్థ అమలు చర్యలు, ఉద్యోగుల అభిరుచి నేపథ్యంలోనే ఈ వృద్ధిని సాధించగలిగినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీ బోర్డు డైరెక్టర్లు ఈక్విటీ షేర్‌కు రూ. 4 మధ్యంతర డివిడెండ్‌కు ఆమోదం తెలిపినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేర్ ధర రూ. 1,015 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story