సలాం.. వైద్య, పారిశుధ్య సిబ్బంది

by vinod kumar |
సలాం.. వైద్య, పారిశుధ్య సిబ్బంది
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ కూడా భయపడుతోంది. ఈ మహమ్మారి నుంచి రక్షణకు ప్రజలందూ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన ప్రాణాల కోసం అహర్నిశలు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తున్నారు వైద్య, ఆశా, పారిశుధ్య సిబ్బంది. వారి సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడక తప్పదు. వారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తూ వారిలో కరోనా చైతన్యం నింపుతున్నారు.

గంటల తరబడి వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయితే, వారు తమ ఇంటికి వెళ్తే తమ యోగక్షేమాలు చూసే వారు కరువయ్యారని లోలోపల మధన పడుతున్నారు. కనిపించే వ్యాధితో పోరాడవచ్చు కాని కనిపించని వైరస్‌తో పోరాడుతున్న వైద్య సిబ్బంది నిత్యం వారిని వారు రక్షించుకుంటూ ప్రజలనూ కాపాడుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సమాచారం ఇవ్వడంతో పాటు వారి కోసం అన్ని రకాల ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా విధుల నిర్వహణ చేస్తున్నారు. తీరా విధులను ముగించుకుని ఇంటికి వెళ్తేసంతోషంగా వారి కుటుంబసభ్యులతో కలిసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. చివరకు తమ కన్న బిడ్డలను కూడా దగ్గర తీసుకోలేని దయనీయ స్థితిలో వారు ఉన్నారు. తమ ఇంట్లో తామే అనాథలుగా వేరే గదిలో స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.

ఇంట్లోకి వెళ్తే ఏమౌవుతుందో అనే భయం వారిని వెంటాడుతునే వుంది. మార్చి 22వ తేదీ నుంచి విధులు నిర్వహిస్తున్న చాలా మంది తమ కుటుంబాలతో సంతోషంగా గడిపే పరిస్థితులను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమానం ఉన్న వారిని అక్కడ పెట్టి చికత్సలను అందిస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 2 క్వారంటైన్ కేంద్రాలు ఉండగా ఒక ఐసోలేషన్ సెంటర్ ఉంది. వనపర్తిలో 2 క్వారంటైన్ కేంద్రాలు ఉండగా, 1 ఐసోలేషన్ సెంటర్, నాగర్ కర్నూల్ జిల్లాలో 3 క్వారంటైన్ కేంద్రాలు 1 ఐసోలేషన్ సెంటర్, గద్వాలలో 2 క్వారంటైన్ కేంద్రాలు, 2 ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయగా నారాయణపేట జిల్లాలో 1 క్వారంటైన్ కేంద్రం 1 ఐసోలేషన్ సెంటర్ ఉంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో 235 మంది, వనపర్తిలో 34 మంది, నాగర్ కర్నూల్లో 19,613మంది, గద్వాలలో22 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే, వీరిని నిరంతరం గమనిస్తూ వారి యోగక్షేమాలు చూసే బాధ్యత ఆరోగ్య సిబ్బందిపైనే వుంది.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విధుల్లో వున్న వైద్య సిబ్బంది విషయానికి వస్తే వనపర్తిలో 56 మంది వైద్యులు, 158 మంది ఎఎన్ఎంలు, 540 మంది ఆశా వర్కర్లు, 69 మంది అంగన్ వాడీలు, 36మంది హెల్త్ అసిస్టెంట్లు, 26మంది పారా మెడికల్ సిబ్బంది, 20 మంది ల్యాబ్ టెక్నిషియన్లతో పాటు మరో 1,000 మందికి ఇతర వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 112 మంది వైద్యులు, 461 మంది ఎఎన్ఎంలు, 902 మంది ఆశా వర్కర్లు, 134 మంది స్టాఫ్ నర్సులు, 64మంది హెల్త్ అసిస్టెంట్లు, 43 మంది ల్యాబ్ టెక్నిషియన్లతో పాటు మరో 2వేల పై చిలుకు ఇతర వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణపేట జిల్లాలో 28 మంది డాక్టర్లు, 606మంది అంగన్ వాడిలు, 596 మంది ఆశా వర్కర్లు, 117 మంది ఎఎన్ఎంలు, 35 మంది హెల్త్ సూపర్ వైజర్లు, 45మంది స్టాఫ్ నర్సులతో పాటు మరో 500 మంది వరకు వైద్య సిబంధి విధులు నిర్వహిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా విషయానికి వస్తే 18 మంది వైద్యులు, 124 మంది ఏఎన్ఎంలు, 624 మంది ఆశా వర్కర్లు, 55 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బంది పనిచేస్తుండగా, మహబూబ్ నగర్ జిల్లాలో 86 మంది డాక్టర్లు, 90మంది పారామెడికల్ సిబ్బది, 995 మంది ఏఎన్ఎంలు, 1156 అంగన్ వాడి వర్కర్లు, 150 మంది ఆశా వర్కర్లు తదితర సిబ్బంది ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న వారిలో ఉన్నారు.

హెల్త్ అసిస్టెంట్‌కు కరోనా..

కరోనా విధుల్లో భాగంగా వారం రోజుల పాటు విధులు నిర్వహించిన ఒక జడ్చర్లలోని కావేరమ్మపేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మొత్తం వైద్య శాఖ సిబ్బంది ఉలికిపడింది. గత వారం రోజుల పాటు అతను డిప్యూటేషన్‌పై హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన స్ర్కీనింగ్ సెంటర్లో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా అతను పలువురు విదేశీయులను స్ర్కీనింగ్ చేయడం జరిగింది. ఐదు రోజుల కిందట అతనికి వైరస్ లక్షణాలు కనిపించడతో అతినికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతినికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబీకులకూ పరీక్షలు నిర్వహించగా అతని తల్లికి కూడా పాజిటివ్‌గా రావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సొంతింట్లో అంటరాని వారిలా..

కరోనా వైరస్ సమీపంలోని వ్యక్తుల వల్ల ఎక్కువగా వర్తిస్తుందని తేలడంతో వైద్య సిబ్బంది తమ సొంతింట్లో అంటరాని వారిలా జీవిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చుట్టు పక్కల వారు, ఇరుగు పొరుగు తమతో మాట్లాడటానికి జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో తాము ఒంటరిగా ఒక్క గదిలో ఉంటున్నామనీ, భోజనం, నిద్ర అదే గదిలో చేసుకుంటూన్నామని చెబుతున్నారు. ఇలా ఉండటం ఇబ్బందికరమైనప్పటికీ తమ ఆరోగ్యంతో పాటు కుటుంబీకుల ఆరోగ్యం ముఖ్యమని అంటున్నారు. అయితే, చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంటికి వెళ్లగానే పిల్లలు దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే వారిని అడ్డుకోవడం చూసి ఏడవడం బాధపడుతున్నామని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తాము ఇంతగా ప్రజల కోసం అనేక బాధలు దిగమింగుకుని సేవలందిస్తుంటే కొంత మంది బాధ్యతా రాహిత్యం ప్రదర్శిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. విధి నిర్వహణలో వైద్య, పారిశుధ్య సిబ్బంది సమర్థవంతంగా తమ బాధ్యత నిర్వర్తిస్తుంటే ప్రజలు వారికి సలాం కొట్టాల్సిందేననీ, వారి సూచనలు పాటించాలని బాధ్యతగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: covid 19, muncipal, health dept, aasha workers, prevention

Advertisement

Next Story