హార్లే-డెవిడ్సన్‌కు పంపిణీదారుగా హీరో

by  |
హార్లే-డెవిడ్సన్‌కు పంపిణీదారుగా హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఉత్పత్తిని ఆపేసినప్పటికీ పంపిణీని కొనసాగించేందుకు అమెరికా దిగ్గజ టూ-వీలర్ కంపెనీ హార్లే-డెవిడ్సన్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్‌లో ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించిన హార్లే-డెవిడ్సన్ దేశీయ దిగ్గజ టూ-వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్‌తో చర్చలను జరుపుతోంది. భారత్‌లో పంపిణీని కొనసాగించేందుకు ఈ చర్చలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా భారత్‌లో అమ్మకాల వృద్ధి క్షీణిస్తున్న నేపథ్యంలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న తయారీ కర్మాగారాన్ని మూసేస్తున్నట్టు హార్లే-డెవిడ్సన్ ఇటీవల ప్రకటించింది.

అయితే, హార్లే బైక్‌లను దిగుమతి చేసేందుకు, విక్రయించేందుకు దేశీయంగా హీరో కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హీరో మోటోకార్ప్ భారత్‌లో హార్లే-డెవిడ్సన్‌కు ప్రధాన పంపిణీదారుగా ఉండనుంది. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉండనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అంశంపై స్పందించిన హార్లే-డెవిడ్సన్ ప్రతినిధి మాట్లాడుతూ..ఊహాగానాలపై స్పందించడం వీలవదని చెప్పారు. వినియోగదారుల సేవలను కొనసాగించడానికి కంపెనీ వివిధ మార్గాల కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు.



Next Story

Most Viewed