సింగూర్ ప్రాజెక్టు నీటితో 2.19 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు

by Shyam |
సింగూర్ ప్రాజెక్టు నీటితో 2.19 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు
X

దిశ‌, అందోల్: సింగూర్ ప్రాజెక్టు నీటిని సేద్యానికి అందించేందుకు ప్ర‌భుత్వం సింగూర్ ప్రాజెక్టుకు రెండు వైపుల బ‌స్వ‌వేశ్వ‌ర‌, సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోథ‌ల ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టింది. ఈ పనుల‌కు సంబంధించి ఇరిగేష‌న్ శాఖ అధికారులు స‌ర్వేను చేప‌డుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థికశాఖ మంత్రి హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఆర‌ణ్య భ‌వ‌న్‌లో ఇరిగేష‌న్ శాఖ అధికారుల‌తో స‌ర్వే నిర్వ‌హ‌ణ ప‌నుల‌పై స‌మీక్ష జ‌రిపారు. సంగారెడ్డి జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలలో సుమారు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స‌నుల‌ను ఈ నెల 12న ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా అందోలుకు 56 వేల ఎక‌రాలు, సంగారెడ్డిలో 57 వేల ఎక‌రాలు, జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ల‌క్ష 6 వేల ఎక‌రాల‌కు సాగు నీరంద‌నుంది. ప్రాజెక్టుపై రెండు పంప్ హౌస్‌ల‌ను నిర్మించి, మొద‌టి పంప్ ద్వారా హైద్లాపూర్ నుంచి వెంక‌టాపూర్ డెలివ‌రీ సిస్టం వ‌ర‌కు 125 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు నీటిని ఎత్తిపోయ‌నున్న‌ట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. ఈ డెలివరీ సిస్టం నుండి జహీరాబాద్, హద్నూర్, కంది కెనాల్స్ ద్వారా దాదాపు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు.

రెండవ లిప్ట్ ను జహీరాబాద్ కెనాల్ పై హతికుర్దు నుంచి గోవిందాపూర్ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 2.19 ల‌క్ష‌ల ఎకరాలకు నీరందించే ప్రణాళికలో భాగంగా రెండవ లిఫ్ట్ ద్వారా సుమారు 42 వేల ఎకరాలకు నీరిందిస్తామని తెలిపారు. ఈ రెండో లిఫ్ట్ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు నీరు అందుతుందని మంత్రికి వివరించారు. స‌ర్వే ప‌నుల‌ను వేగంగా చేయాల‌ని, ఈ ప‌నులు పూర్త‌యితే నిర్మాణం ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్ట‌వ‌చ్చున‌ని మంత్రి హరీశ్ రావు ఇరిగేష‌న్‌ శాఖ అధికారులకు, కన్సల్టెంట్ ఎజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సమీక్షా స‌మావేశంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి సీఈవి అజయ్ కుమార్, ఎస్ఈ మురళీధర్, జహీరాబాద్ ఈఈ, సుబ్రమణ్య ప్రసాద్, సంగారెడ్డి ఈఈ మధుసూదన్ రెడ్డి, కన్సల్టెంట్ ఎజెన్సీ ప్రతినిధి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed