వారిపై హరీశ్‌రావు అసహనం.. దిద్దుబాటు చర్యల్లో బిజీగా కేసీఆర్.!

by Anukaran |   ( Updated:2021-10-04 01:46:04.0  )
వారిపై హరీశ్‌రావు అసహనం.. దిద్దుబాటు చర్యల్లో బిజీగా కేసీఆర్.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వంపైనా, మంత్రులపైనా, పరిపాలనపైనా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అసమ్మతి పెరిగిపోతున్నది. మంత్రులకు నిరసనలు పెరుగుతున్నాయి. స్థానిక సంస్థల కోటా కింద గెలిచిన ఎమ్మెల్సీలకూ అసంతృప్తి ఉన్నది. వచ్చే ఏడాది జనవరిలో ఎనిమిది మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానున్నది.

జూన్ నాటికి మరో ఐదుగురు కూడా రిటైర్ కానున్నారు. వీరంతా అధికార పార్టీకి చెందినవారే. మొత్తం 13 మందిని తిరిగి అదే కోటాలో టీఆర్ఎస్ గెలిపించుకోవాల్సి ఉంది. కానీ సర్పంచ్‌ల మొదలు ఎంపీటీసీలు, జడ్పీటీసీల వరకు అసమ్మతి నెలకొనడంతో పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నది. అందుకే స్థానిక సంస్థల అంశాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు.

స్థానిక సంస్థల్లోని అసౌకర్యాలపై ఆ కోటా కింద గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల కౌన్సిల్ వేదికగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఎంపీటీసీలకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఆ మరుసటి రోజే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు గౌరవ వేతనంలో 30% పెంపును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మంత్రి హరీశ్‌రావును ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు కలిసి సమస్యల పరిష్కారం కోసం మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ విన్నవించుకున్నారు. మరోవైపు సర్పంచ్‌లదీ అదే సమస్య.

మంత్రి హరీశ్‌రావు స్పందించిన తీరు ఎంపీటీసీలకు ఆగ్రహం తెప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఎకరం పొలం అమ్ముకోవాలంటూ ఆయన సలహా ఇవ్వడం ఆగ్రహానికి ఆజ్యం పోసింది. వారిలో అసమ్మతి మరింత పెరిగింది. అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచే ఈ తరహా నిలదీతలు ఎదురుకావడం టీఆర్ఎస్ నేతలకు జీర్ణం కావడంలేదు. ఈ పరిస్థితుల్లో కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్రతకు అద్దం పట్టినట్లయింది. జనవరిలో, జూన్‌లో ఖాళీ కానున్న మొత్తం 13 స్థానాలను గెలుచుకోవడం అధికార పార్టీకి సవాలుగా మారింది.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ వేదికగానే స్థానిక సంస్థల పటిష్టత, ప్రభుత్వం నుంచి నిధుల విడుదల, అభివృద్ధి పనుల పురోగతి లాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి లాంటివన్నీ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి మరీ స్థానిక సంస్థలకు ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తున్నట్లు నొక్కిచెప్పారు. ఒకవైపు సర్పంచ్‌లు సకాలంలో ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో సొంత డబ్బుల్ని ఖర్చు చేయడం, అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయడం లాంటివి చేపట్టారు. చివరకు అప్పుల భారం, వడ్డీ తిప్పలతో ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లా ఎంపీటీసీలు మంత్రి హరీశ్‌రావుతోనే అసంతృప్తిని వెళ్ళగక్కారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేనంత గౌరవంతో, ధైర్యంగా తెలంగాణ సర్పంచ్‌లు ఉన్నారంటూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయోననే ఉద్దేశంతో ఇప్పటి నుంచే కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వస్తున్నదన్న టాక్ టీఆర్ఎస్‌లో బహిరంగంగానే వినిపిస్తున్నది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపుపై ఇప్పటికీ స్పష్టమైన ధీమా వ్యక్తంకాని పరిస్థితుల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల్లోనూ అసంతృప్తి చోటుచేసుకోవడం పార్టీ నాయకత్వానికి మింగుడుపడడంలేదు. హుజూరాబాద్ ఎన్నిక పూర్తికాగానే ఇక స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టిన వరుస రివ్యూ, ప్రత్యేక మీటింగులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు..

1. పురాణం సతీష్
2. భానుప్రసాద్
3. నారదాసు లక్ష్మణ్
4. భూపాల్‌రెడ్డి
5. సుంకరి రాజు
6. కసిరెడ్డి నారాయణరెడ్డి
7. బాలసాని లక్ష్మీనారాయణ
8. కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి
9. తేరా చిన్నపరెడ్డి
10. పట్నం మహేందర్ రెడ్డి
11. కల్వకుంట్ల కవిత
12. ఎంఎస్ ప్రభాకర్ రావు
13. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.

Advertisement

Next Story

Most Viewed