ఇషాంత్ క్షమాపణలు చెప్పాడు: సామీ

by  |
ఇషాంత్ క్షమాపణలు చెప్పాడు: సామీ
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో వర్ణ వివక్ష ఉందని, తాను స్వయంగా వివక్షకు గురయ్యానని వెస్టిండీస్ ఆటగాడు డారెన్ సామీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తనను ‘కాలు’ అని సంబోధించి అవమానించారని చెప్పాడు. అయితే, అలా పిలిచింది ఇషాంత్ శర్మ అని చాలా మంది అనుమానించారు. గతంలో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఆధారంగా ఇషాంత్ ఇలా చేశాడని తేల్చి చెప్పారు. కాగా, ఇషాంత్ తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడని సామీ స్పష్టం చేశాడు. అతను దురుద్దేశంతో అలా (కాలూ) సంబోధించి ఉండడని విండీస్ క్రికెటర్‌ పేర్కొన్నాడు. ఈ విషయం ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామని వెల్లడించాడు. నేను ఇషాంత్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఇక ఆ అధ్యాయం ముగిసిపోయింది. దాన్ని వదిలేసి ముందుకు వెళ్తున్నాను. తనపై నాకు ఎలాంటి కోపం లేదు. మళ్లీ కలిస్తే మనసారా కౌగిలించుకుంటానని సామీ పేర్కొన్నాడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత వర్ణ వివక్షపై పలువురు స్పందించారు. ఈ క్రమంలో సామీ తనకు జరిగిన అనుభవాన్ని బయటపెట్టాడు.


Next Story

Most Viewed