గచ్చిబౌలి కేంద్రంగా హెచ్-1-బీ వీసా స్కామ్

by Sumithra |
H1B visa
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న గచ్చిబౌలిలో క్లౌడ్ జెన్ సిస్టమ్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ హెచ్-1-బీ వీసాల స్కామ్‌లో చిక్కుకున్నది. అమెరికాలోని పలు ఐటీ కంపెనీలకు ఉద్యోగులను పంపించే థర్డ్ పార్టీ ఏజెన్సీగా పనిచేసే ఈ సంస్థ కమిషన్ల రూపంలో 2013 నుంచి 2020 మధ్య కాలంలో సుమారు ఐదు లక్షల డాలర్ల మేర ఆర్జించినట్లు తేలింది. అమెరికా (హ్యూస్టన్)లోని ఫెడరల్ కోర్టులో ఇటీవల (మే 28న) జరిగిన ఒక కేసుకు సంబంధించిన విచారణలో ఫెడరల్ ప్రాసిక్యూటర్ జెన్నీఫర్ లోరీ వాదన సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో క్లౌడ్ జెన్ సిస్టమ్స్ కంపెనీకి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చక్కలక్కల్ జోమన్ అంగీకరించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.

అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయని భారత్‌లోని యువతను నమ్మించి వారి నుంచి కమిషన్ తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగమంటూ దరఖాస్తు చేసి హెచ్-1-బీ వీసా పేరుతో పంపిస్తూ ఉన్నదని, కానీ ఇటీవల కొద్దిమంది యువతకు ఉద్యోగాలు లేవని తెలిసిన తర్వాత క్లౌడ్ జెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ప్రాసిక్యూటర్ వివరించారు. అమెరికా ఐటీ మార్కెట్‌లో ఉన్న ఉపాధి అవకాశాలను బేరీజు వేసుకున్న థర్డ్ పార్టీ సంస్థలు అర్హత కలిగిన యువతను సమకూర్చడానికి కొంత టైమ్ తీసుకుంటాయని, ఆ ప్రకారం అమెరికాలోని కంపెనీ ఈ యువతను ఉద్యోగంలోకి తీసుకోడానికి ఆమోదం తెలిపిన తర్వాత థర్డ్ పార్టీ దాఖలు చేసే ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల పరిశీలనా క్రమంలో ‘స్విచ్‘ అనే ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని ప్రాసిక్యూటర్ వివరించారు.

ఈ వ్యవహారంపై వాదనల సందర్భంగా క్లౌడ్ జెన్ సిస్టమ్స్ కంపెనీ ఒక థర్డ్ పార్టీగా ఇలాంటి ఉపాధి అవకాశాల పేరుతో హెచ్-1-బీ వీసాల మంజూరులో అవకతవకలకు పాల్పడడమే కాకుండా ఉద్యోగాలే లేకుండా యువతకు వీసాలు ఇప్పించి అమెరికాలో నిరుద్యోగులుగా వదిలినట్లు ప్రాసిక్యూటర్ వాదించారు. క్లౌడ్ జెన్ సిస్టమ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చక్కాక్కల్ జోమన్ సైతం నిబంధనలకు విరుద్ధంగా మోసానికి పాల్పడినట్లు అంగీకరించారని భావించిన కోర్టు లక్ష డాలర్ల జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు ప్రోబేషన్ శిక్ష విధించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. క్లౌడ్ జెన్ సిస్టమ్ కంపెనీ ప్రెసిడెంట్‌గా పల్లెంపాటి శశి వ్యవహరిస్తున్నారు.

Advertisement

Next Story