గాడిదలపైన గుట్కా రవాణా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

by Shyam |
గాడిదలపైన గుట్కా రవాణా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
X

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్‌తో నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట పడటంతో అక్రమార్కులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. చావు తెలివితేటలను ఉపయోగించి నిషేధిత వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. గాడిదలపైన నిషేధిత గుట్కాను తరలిస్తుండగా కామారెడ్డి జిల్లా పోలీసులు శనివారం పట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కామారెడ్డి జిల్లాకు సరిహద్దు ఉంది. ఆయా రాష్ట్రాల నుంచి నిషేధిత గుట్కాను తీసుకువచ్చి జిల్లాలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక్కడే అక్రమార్కులు తమ తెలివితేటలను ప్రదర్శించారు. గాడిదలపైన సంచుల్లో గుట్కా ప్యాకెట్లు ఉంచి రాష్ట్ర సరిహద్దులు దాటించే ప్రయత్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ రఫీయుద్దీన్ తన సిబ్బందితో కలసి జుక్కల్ మండలం గుండూరు గ్రామం వద్ద తనిఖీ చేశారు. గాడిదలపైన ఉన్న సంచుల్లో కందిపప్పు పొట్టు మధ్యలో ఉంచి తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇది గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Gutka, smuggling, donkeys, jukkal, nizamabad

Advertisement

Next Story

Most Viewed