- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖాతాలో అమౌంట్ తీసుకుంటే అకౌంట్ క్లోజ్
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్నకు చేయూత’ పథకాన్ని తీసుకొచ్చింది. పథకానికి మూడేళ్ల కాలపరిమితిని విధించింది. ఆపద సమయంలో కార్మికులు నిధులను విత్ డ్రా చేసుకుంటే అతని అకౌంట్ క్లోజ్ అయినట్లే. తిరిగి అతడికి పథకంలో జమచేసే అవకాశం లేదు. నిబంధనలు సడలించాలని, కార్మికులకు వెసులుబాటు కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘నేతన్నకు చేయూత’ పథకం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద రంగం చేనేత రంగం. నేతన్న ఆర్థిక ఇబ్బందులతో చేసుకుంటున్న ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ‘నేతన్నకు చేయూత’ పథకాన్ని 2017 జూన్ 24న ప్రారంభించగా, పథకం గడువు 2020 ఆగస్టు20 తేదీతో ముగిసింది. మళ్లీ సెప్టెంబర్ 1 నుంచి రూ.368 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం పున:ప్రారంచనుంది.
రాష్ట్రంలో చేనేత, పవర్ లూమ్స్‌లో పనిచేసే కార్మికులు సుమారు లక్షా 42వేల మంది ఉన్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట వ్యాప్తంగా 17,632 చేనేత మగ్గాలకు మాత్రమే జీయో ట్యాగింగ్ చేసింది. పవర్ లూమ్స్ 2లక్షల వరకు ఉంటాయి. కానీ వాటిలో చాలా వరకు జీయో ట్యాగింగ్ చేయలేదు. చేనేత సంఘాలు, సహకారేతర రంగంలోని జీయో ట్యాగింగ్ మగ్గాలపై పనిచేసే నేత కార్మికులు, వృత్తికి అనుబంధంగా పనిచేస్తున్న డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు, ఇతర చేనేత కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులుగా నిర్ణయించారు. తమ ఆదాయంలో 50శాతం నేత పని ద్వారా పొందే 18 ఏళ్లు దాటిన వారంతా అర్హులే. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీనిని అమలు చేస్తుంది.
చేనేత రంగ కార్మికుడు వేతన వాటాను 8 శాతం జమచేస్తే 8 శాతం ప్రభుత్వం ఇచ్చేది. దానిని ప్రభుత్వం 16శాతానికి పెంచింది. దీనితోడు చేనేతకు అనుబంధంగా పనిచేసే చేనేత కార్మికుడితోపాటు డెయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు, ఇతర చేనేత కార్మికులు కూడా ఈ పథకంలో చేరే వెసులుబాటు కల్పించింది. కానీ పవర్ లూమ్స్ కార్మికులకు మాత్రం వేతన వాటా 8 శాతానికి ప్రభుత్వం 8 శాతం జమ చేయనుంది. కార్మికుల వేతన వాటాను లాకిన్ పిరియడ్ కన్నా ముందే వెసులుబాటు కల్పించారు. ప్రతి నెలా 15లోగా చేనేత కార్మికులు తమ అకౌంట్లో డబ్బును జమచేస్తే ప్రభుత్వ వాటా జమ అవుతుంది.
కానీ ఎవరైనా ఆపద సమయంలో డబ్బులు తీసుకుంటే అతడి అకౌంట్ క్లోజ్ అయినట్లే. తిరిగి అతడికి మళ్లీ జమచేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించలేదు. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండు మూడు నెలలు బ్యాంకులో వాటాను జమచేయపోయినా అతడి ఖాతా క్లోజ్ అవుతుంది. తిరిగి జమచేసుకునే అవకాశం సైతం లేదు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే ఆయన కుటుంబీకులు లేదా ఇతర నామినీలు నగదును పొందే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం పెట్టినా ఏళ్ల తరబడి కొనసాగేలా జీవోలను జారీ చేస్తుంది. కానీ చేనేత సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘నేతన్నకు చేయూత’ పథకానికి మాత్రం మూడేళ్లే గడువు విధించింది. ఈ గడువు ముగిస్తే తిరిగి పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అనేది సందిగ్ధం నెలకొంటుంది. ప్రభుత్వానికి చేనేత కార్మికులపై చిత్తశుద్ధి లేకనే అని చేనేత సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇది కేవలం ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మూడేళ్ల కాలపరిమితి కాకుండా నిరంతరం కొనసాగేలా జీవోలు తీసుకురావాలని చేనేతలు కోరుతున్నారు.
ప్రభుత్వ వాటాను జమచేయాలి
కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికుల వాటాను అకౌంట్లల్లో జమచేయకున్నా ప్రభుత్వమే 16 శాతం జమ చేయాలి. ప్రభుత్వం నేతన్నల కోసం ప్రవేశపెట్టిన చేయూత పథకానికి మూడేళ్ల పరిమితి తొలగించి నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. లాకిన్ పిరియడ్ కాకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించాలి. అకౌంట్‌ను క్లోజ్ చేయకుండా ప్రభుత్వ వాటాను జమచేస్తూ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కార్మికుల వాటాను జమచేసుకునే అవకాశం ఇవ్వాలి.
-కురుపాటి రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం
కార్మికులకు వెసులుబాటు కల్పించాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కేవలం రాజకీయాల కోసం కాకుండా చేనేత కార్మికులకు లబ్ధిచేకూరేలా ఉండాలి. కార్మికులు తమవాటాను కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో జమచేయకపోయినా ప్రభుత్వ వాటాను జమచేసేలా చర్యలు తీసుకోవాలి. కార్మికుడు ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకునేలా, తిరిగి జమ చేసుకునేలా చూడాలి. వరుసగా రెండుమూడు నెలలు వాటాను జమచేయకపోతే అకౌంట్‌ను క్లోజ్ చేయొద్దు. ఏపీ మాదిరిగా నెలకు రూ.2వేలు అకౌంట్లో జమచేయాలి. నేతన్న చేయూత, చేనేత మిత్రకు నిబంధనలు సడలించాలి. చేనేత బీమాకు ఏజ్ లిమిట్ లేకుండా చర్యలు చేపట్టాలి.
-పాశికంటి లక్ష్మీనర్సింహ, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం