- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ ఎన్నికలకు కీలక అడుగులు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ లో పోలింగ్ ప్రక్రియను ముగించనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిర్ణీత గడువులోగా జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం ముగుస్తుందని, గడువు ముగిసే మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి కావాలని జీహెచ్ఎంసీ చట్టంలో పేర్కొన్నారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నిర్ణీత గడువులోగా ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లలో వేగం పెంచింది.
అవే రిజర్వేషన్లు..
గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగనున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టత ఇచ్చింది. వార్డుల విభజన ఉంటుందని కొంతమేరకు ఆశించినా పాత రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో దానికి బ్రేక్ పడింది. అలాగే, పోలింగ్ బూత్‌ల్లో ఓటర్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 1200 ఓటర్లకు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, కొవిడ్ దృష్ట్యా ఈసారి ఓటర్లను వెయ్యికి తగ్గించింది. కాగా, ఇప్పటికే ప్రతి డివిజన్‌కు అధికారులను నియమించిన ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సవరణపై ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఓటర్ల జాబితా సవరణ, ముసాయిదాపై తేదీలను ఖరారు చేశారు.
స్థానికంగానే పోలింగ్ కేంద్రాలు…
గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను స్థానికంగా వార్డు పరిధిలోనే ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈసారి మార్పుల నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, మున్సిపల్ వార్డు కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను పోలింగ్ కేంద్రాలకు వినియోగించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు, తాత్కాలిక ఏర్పాట్ల కోసం రిటర్నింగ్ అధికారులకు అధికారాలిచ్చారు. కచ్చితంగా దిగువ అంతస్తుల్లోనే పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. ఇలా పోలింగ్ కేంద్రాల్లో కచ్చితంగా కనీస సౌకర్యాలను కల్పించాలని మార్గదర్శకాల్లో వివరించారు.
ఈ నెల 7న ఓటర్ల జాబితా ముసాయిదా..
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 7న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. 8 నుంచి 11 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9న జీహెచ్ఎంసీ పరిధిలోని గుర్తింపు పొందిన పార్టీలతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం నిర్వహించాలని, 10న సర్కిళ్ల వారీగా పార్టీలతో డిప్యూటీ కమిషనర్లు సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాపై చర్చించాలని సూచించారు. ఈ నెల 12న ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని, ఈ నెల 13న గ్రేటర్‌లో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. సర్కిళ్ల వారీగా తుది జాబితా విడుదల చేయాలని సూచించారు. ఈ ఏడాది జనవరి 1న విడుదల చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రామాణికంగా గ్రేటర్ ఎన్నికల ఓటరు జాబితా తీసుకోవాలని సూచించారు.
నోటిఫికేషన్ వెలువడే నాటి వరకు ఓటు నమోదు..
ఇక గ్రేటర్‌లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఈ నెలలో విడుదల చేసే తుది ఓటరు జాబితాకు అనుగుణంగా కొత్త ఓటర్లతో సప్లిమెంటరీ జాబితా ఉంటుందని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు రోజు వరకూ ఓటు నమోదు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ అధికారులతో ఎస్ఈసీ సమావేశం..
గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం పాలకవర్గం పదవీకాలం గడువుకు నిర్ణీత సమయంలో ఎన్నికలు జరపాలని ఆదేశాలున్నాయన్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, ఈ నెల7న ముసాయిదా ప్రదర్శించాలన్నారు. ఓటరు జాబితాపై నిర్లక్ష్యంగా ఉండరాదని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సూచించారు.