జీతాలు ఇవ్వలేదు.. ఆర్థిక ఇబ్బందులతో గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2021-09-11 11:16:26.0  )
జీతాలు ఇవ్వలేదు.. ఆర్థిక ఇబ్బందులతో గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి మహబూబ్‌నగర్/ వెల్దండ: కళాశాలలు ప్రారంభమైన.. అవకాశాలు రాక.. గత 18 నెలల నుండి జీతాలు లేక మనోధైర్యాన్ని కోల్పోయి ఓ గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన.. శనివారం సాయంత్రం వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన బ్రహ్మచారి, అలివేలు దంపతుల రెండవ కుమారుడు గణేష్ చారి(30). గత రెండు సంవత్సరాల క్రితం వెల్దండ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా చేరాడు. వచ్చే జీతంతో కుటుంబాన్ని గడుపుతూ వచ్చాడు. కానీ, కరోనా సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యం కోసం అప్పులు చేశాడు.

ఈ క్రమంలో కోలుకున్న గణేష్ చారి కళాశాలలు ఆరంభమైతే తిరిగి తనకు లెక్చరర్‌గా పని చేసే అవకాశం లభిస్తుందని ఆశించాడు. కానీ, కళాశాలలు ఆరంభమై రెండు వారాలు కావొస్తున్నా గెస్ట్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో.. గణేష్ చారి మనోధైర్యం కోల్పోయి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, మృతుని సోదరి కూడా ఇప్పటికే మరణించగా.. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, సోదరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గణేష్ చారి ఆత్మహత్యపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story

Most Viewed