పంచాయతీల్లో హరితహారం వేగవంతం

by Shyam |
పంచాయతీల్లో హరితహారం వేగవంతం
X

దిశ, భువనగిరి: రాష్ట్రంలో అడవుల శాతం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఏడో విడత హరితహారం భాగంగా జిల్లాలోని 421 గ్రామపంచాయతీలలో సుమారుగా 460 పైచిలుకు ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకం శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు అధికారులు నర్సరీలు మంజూరు చేశారు. రానున్న జూన్‌లోగా పూర్తిస్థాయిలో మొక్కలు పెంచడడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. నర్సరీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలిస్తున్నారు.

జిల్లాలో 460 పై చిలుకు నర్సరీలు ఒక్కో నర్సరీల్లో 10 వేల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటి హరితశోభను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచడానికి వన సేవకుడిని నియమించి సాంకేతిక సాయం అందించడానికి పంచాయతీ కార్యదర్శిని భాగస్వాములను చేశారు. మొక్కలు పెంచేందుకు అనువైన నీటి వసతి ఉన్న నేలలనుఎంపిక చేశారు. ఇప్పటికే నూరు శాతం పాలిథీన్ కవర్లలో మట్టిని నింపే కార్యక్రమం పూర్తి చేయడంతో పాటు కొన్ని చోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. మొక్కల రకాలు నర్సరీల్లో ప్రజల అభీష్టం మేరకు అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు వాణిజ్య పరంగా లాభసాటిగా ఉండే మొక్కలు పెంచదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో నర్సరీలో 40 శాతం టేకు మొక్కలు మిగతా 60 శాతం పూలు, పండ్ల మొక్కలతో పాటు నీడ నిచ్చే మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇంటి పరిసరాల్లో పెంచేందుకు ఉసిరి, చింత, మునగ, నిమ్మ, దానిమ్మ, సపోటా, కరివేపాకు, గులాబీ, వేప, కానుగ, గుమ్మడి, టేకు వంటి మొక్కలు పెంచుతున్నారు.

పకడ్బందీ పర్యవేక్షణలో పెంచుతున్నాం

జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంచడానికి ఎప్పటికప్పుడు నర్సరీలు పర్యవేక్షిస్తూ మొక్కలను సంరక్షించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మొక్కలు పెంచడంలో తీసుకోవాల్సిన సూచనలు, జాగ్రత్తలు నిర్వాహకుల కు వివరిస్తున్నాం.

-ఎం.ఉపేందర్‌రెడ్డి డీఆర్డీవో

Advertisement

Next Story