‘పండించిన ప్రతి గింజనూ సర్కారే కొంటది’

by Aamani |
‘పండించిన ప్రతి గింజనూ సర్కారే కొంటది’
X

దిశ, ఆదిలాబాద్: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనే పూచీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి హామీనిచ్చారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ, ఐకేపీ, పీఏసీఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,017 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిర్మల్ జిల్లాలో 91 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1,760 చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే, కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అత్యవసరముంటేనే బయటకు రావాలని సూచించారు. అంతకుముందు రాయదారి గ్రామంలో తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, 30 మంది వలస కూలీలకు రూ.500 చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24గంటల ఉచిత కరెంట్ కల్పించి, ఎస్సారెస్పీలో నీరు ఉండేలా చర్యలు తీసుకోవడం వల్లే జిల్లాలో మంచి దిగుబడులు వచ్చాయన్నారు. మొక్కజొన్న పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల అకౌంట్‌లోకి డబ్బులు వేస్తామని చెప్పారు. వరి ధాన్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాబోతుందనీ, ఇందుకోసం 201 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు. వీరితో పాటు ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

tags: minister niranjan reddy, indra karan reddy, MLA vittal reddy, crop but centre, nirmal, mamada, ikp, pacs

Advertisement

Next Story