దగ్గు, జలుబు, జ్వరంతో వచ్చారా.. మాకు చెప్పండి!

by  |
దగ్గు, జలుబు, జ్వరంతో వచ్చారా.. మాకు చెప్పండి!
X

దిశ, న్యూస్ బ్యూరో:
హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు ప్రతీరోజూ కొత్తవి పుట్టుకొస్తుండడంతో ప్రభుత్వం సీరియస్ దృష్టి పెట్టింది. లక్షణాలు ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఇంటింటికీ వైద్యారోగ్య సిబ్బంది తిరుగుతూ వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు మెడికల్ షాపుల్లో పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి మాత్రలను కొనేవారి వివరాలను తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఈ చర్యలు సరిపోవని భావించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మరో అడుగు ముందుకేసింది. నగరంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్లినిక్‌లు, ఆసుపత్రులు, ప్రైవేటు డాక్టర్ల దగ్గరకు ఈ లక్షణాలతో వచ్చిపోతున్నవారి వివరాలను సేకరించాలనుకుంటోంది. లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా మాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారన్న అనుమానం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి వస్తున్న పేషెంట్ల వివరాలను ఇవ్వాల్సిందిగా క్లినిక్‌, ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ లాంటి నిర్వాహకుల నుంచి వివరాలను కోరుతోంది. రకరకాల వ్యాధులకు సంబంధించి పేషెంట్లు వస్తున్నా కేవలం పై లక్షణాలతో వస్తున్నవారి వివరాలను మాత్రమే ఇవ్వాల్సిందిగా సూచించింది. నగరంలో మాత్రమే కాక గద్వాల, నిజామాబాద్, సూర్యాపేట లాంటి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కంటైన్‌మెంట్ క్లస్టర్లలోనూ ఈ విధానాన్ని అవలంబించనుంది.

ఈ నివేదికలు ప్రతీరోజూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చేరుతాయి. ఆ వివరాల ప్రకారం క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి అవి కరోనా లక్షణాలేనా కాదా అని నిర్ధారించుకుంటారు. ఒకవేళ కరోనాకు సంబంధించినవని భావిస్తే వారిని సమీపంలోని ఆసుపత్రిలో ఐసొలేషన్‌లో ఉంచి కరోనా నిర్ధారణ పరీక్షలను చేయిస్తారు. పాజిటివ్ అని నిర్ధారణ అయితే గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. లేదా అవసరాన్ని బట్టి హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోరాదని వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నా ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోడానికి సిద్ధపడకపోవడంతో వైద్యారోగ్య శాఖ ఈ దిశగా ఆలోచించింది. ప్రైవేటు ఆసుపత్రులకు, క్లినిక్‌లను సంప్రదిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని, మరో రకంగా ఆ వ్యాధి కుటుంబంలోనివారికీ, పక్కనున్నవారికి అంటుకుంటోందని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి చర్యల వల్ల వ్యాపిస్తూనే ఉన్నదని గ్రహించింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకటి రెండు రోజుల్లోనే ఇది అమలులోకి వస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏక కాలంలో బహుముఖ వ్యూహాన్ని అనుసరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఒకవైపు కంటోన్‌మెంట్ క్లస్టర్లు, మరోవైపు మెడికల్ షాపులపై నిఘా, ఇంకోవైపు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌ల నుంచి వివరాలు తీసుకోవడం తప్పనిసరి అయిందన్నారు. నగరంలో చార్మినార్, ఆసిఫ్‌నగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనూ దీన్ని జిల్లా వైద్యాధికారుల నేతృత్వంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ చర్యలకు తోడు వైరస్ వ్యాప్తిని విశ్లేషించి తదనుగుణమైన ప్రణాళిక రూపొందించడానికి ఎపిడమాలజిస్టులను సైతం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటోంది. రాష్ట్రంలో ఇప్పటికే 26 మంది ఉండగా, కొన్ని రోజుల క్రితం అదనంగా మరో ఇరవై మందిని తీసుకున్నామని, తాజాగా మరో ఏడుగురిని తీసుకుంటున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తిని విశ్లేషించి నివేదికలు రూపొందిస్తారని, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వివరించారు.

బైట నుంచి వ్యక్తుల ద్వారా వైరస్ వచ్చే అవకాశాలన్నీ మూసుకుపోయినందున స్థానికంగా ఉన్నవారి నుంచే మరొకరికి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వైరస్‌ను మోసుకొచ్చే అవకాశం ఉన్నందున చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని గుర్తుచేసిన ఆ అధికారి, గద్వాలలో పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోడానికి కర్నూలులో తీవ్రతే కారణమన్న అంచనాకు వచ్చారు. చెక్‌పోస్టుల దగ్గర రాకపోకలను నిలువరిస్తున్నా చుట్టూ పల్లెల్లోని పొలాల మీదుగా వస్తున్నట్లు ఇటీవల తెలిసిందని, అందుకే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి అక్కడ కూడా పోలీసు పహరా కొనసాగిస్తున్నట్లు ఉదహరించారు.

Tags: Telangana, Corona, Containment Zones, Private Clinics, Hospitals


Next Story

Most Viewed