రోజుకు లక్ష కరోనా టెస్టులకు ప్రణాళికలు

by vinod kumar |
రోజుకు లక్ష కరోనా టెస్టులకు ప్రణాళికలు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి వేగమందుకున్నది. దానికి తగినట్టుగా చేపట్టాల్సిన కొవిడ్ 19 టెస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. అదీగాక, మొదట్లోలాగా కేవలం విదేశాల నుంచి తిరిగి వచ్చినవారికే పరిమితమవకుండా ఇతరులకూ ఈ టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని కేంద్రం ఎంచుకున్నాక.. రోజుకు జరపాల్సిన కొవిడ్ 19 టెస్టుల సంఖ్య పెంచాల్సి వస్తున్నది. అందుకే ఇప్పుడు రోజుకు నిర్వహిస్తున్నసుమారు 15వేల టెస్టుల సంఖ్యను మే నెలాఖరుకల్లా లక్షకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. శనివారం పలురాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ ఈ టార్గెట్‌లను రాష్ట్రాల ముందుంచింది. హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం.. మార్చి 20 వరకు 75 ల్యాబరేటరీలు నిర్వహణలో ఉండగా.. రోజుకు 1,200ల టెస్టుల చొప్పున 15వేల పరీక్షలు చేశారు. తర్వాత 190 ల్యాబ్‌లు కొవిడ్ 19 పరీక్షలు జరిపాయి. మార్చి 20 తర్వాత.. రోజుకు టెస్టుల సంఖ్యను 7,800లకు పెంచగా.. ఏప్రిల్ 2వ తేదీకల్లా 77వేల టెస్టులను కేంద్రం నిర్వహించింది. ఇప్పుడు రోజుకు 15వేల టెస్టులను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఏప్రిల్ 10వ తేదీకల్లా నిర్వహించిన కొవిడ్ 19 టెస్టుల సంఖ్య 1.6లక్షలకు చేరింది.

30నాటికి 300 టెస్టింగ్ ల్యాబ్‌లు:

జనవరి 31వ తేదీనాటికి మనదేశంలో కొవిడ్ 19 టెస్టింగ్ కోసం కేవలం ఒకే ఒక్క ల్యాబ్ ఉంది. కానీ, ఈ సంఖ్య ఏప్రిల్ 10నాటికి 220కి పెరిగింది. ఈ నెలాఖరుకల్లా మరో 80 ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 586 కొవిడ్ 19కోసం ప్రత్యేకంగా పనిచేసే ఆస్పత్రులున్నాయి. 1.04 లక్షల ఐసొలేషన్ బెడ్‌లున్నాయి. 11,800ఐసీయూ పడకలు, 6,400 వెంటిలేటర్లున్నాయి. కాగా, 2.84 పీపీఈ కిట్లున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, 2.7 లక్షల కిట్లు ఈ నెలాఖరుకల్లా దేశంలోకి రాబోతున్నట్టు వివరించింది. 28.52 ఎన్95 మాస్క్‌లుండగా.. 48.52లక్షల మాస్క్‌లు ఈ నెలాఖరుకల్లా సమకూరనున్నట్టు పేర్కొంది.

tags.. coronavirus, tests, laboratories, hospitals, covid 19, kits, isolation, cases

Advertisement

Next Story

Most Viewed