రాజీవ్ స్వగృహ ఫర్‌ సేల్

by Shyam |   ( Updated:2020-03-11 00:58:10.0  )
రాజీవ్ స్వగృహ ఫర్‌ సేల్
X

దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో చెప్పినట్లుగా గంటల వ్యవధిలోనే రాజీవ్ స్వగృహ ఆస్తుల్ని వేలం వేయడానికి కార్యాచరణ ప్రారంభించింది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో (నెం. 20/10.03.2020) జారీ చేసింది. బడ్జెట్‌పై అసెంబ్లీలో ఇంకా చర్చ ప్రారంభమే కాలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పోచంపల్లి, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన స్థలాలు, అసంపూర్తిగా కట్టిన భవనాలు తదితరాలన్నింటినీ వేలం వేయడానికి సిద్ధమైంది. వేలం వేయడానికి అవసరమైన విధి విధానాలను ఉన్నతస్థాయి కమిటీ త్వరలో రూపొందించనుంది. వీటివేలం ద్వారా ప్రభుత్వానికి ఏ మేరకు ఆర్థిక వనరులు సమకూరుతాయన్నది విధివిధానాల్లో పేర్కొనే ధరలపై ఆధారపడి ఉంటుంది.

సర్కారు భూముల్ని అమ్మడం ద్వారా ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 15 వేల కోట్లను సమకూర్చుకోవాలని అంచనా వేసుకుంది. అందులో భాగంగా రెండురోజుల వ్యవధిలోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక జీవో ద్వారా 2007లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 ప్రాజెక్టులను చేపట్టాలన్నది ఈ కార్పొరేషన్ లక్ష్యం. ప్రణాళిక ప్రకారం రాష్ట్రం మొత్తం మీద 46,565 ఇండ్లను నాలుగు కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ. 8,504 కోట్లు ఖర్చవుతుందని అప్పటి అంచనా.

తెలంగాణ ఏర్పడేనాటికి (2008-2011 మధ్యకాలంలో) సుమారు రూ. 6,301 కోట్ల ఖర్చుతో ఇరవై ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం వివిధ బ్యాంకుల నుంచి రుణాలను కూడా కార్పొరేషన్ సమకూర్చుకుంది. నిర్మాణం కోసం సుమారు రూ. 1621.26 కోట్లు ఖర్చు కూడా అయ్యాయి. కానీ, 2011లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాదాపుగా ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో అప్పట్లో ఉన్నతస్థాయి కమిటీని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చివరకు కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనులను ఎక్కడికక్కడ ఆపివేయాలన్న నిర్ణయం జరిగింది. దీంతో చాలాఇండ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్యాంకులకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బకాయిపడిన అప్పులకు వడ్డీతో సహా రూ. 1,071.39 కోట్లను చెల్లించింది. దీంతో అప్పటికే ఇండ్ల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ఉపశమనం కలిగింది. ఆ ప్రకారం పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ఇండ్లను అందజేయడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి పనులను పూర్తిచేసింది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థికసాయం, పన్నుల వాటా రాదన్న అంచనాతో స్వీయ ఆర్థిక వనరులను సమీకరించుకోవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగమే రాజీవ్ స్వగృహ, డక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ లాంటి సంస్థల ఆస్తుల్ని, కొన్ని ప్రభుత్వ భూముల్ని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం ఆమోదం లభించడమే తరువాయి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆ ప్రాంతంలోని భూములకు ఉన్న మార్కెట్ ధర ప్రకారమే వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటోంది.

ఎలాగూ గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుల నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ విధివిధానాలను రూపొందించే క్రమంలో మార్కెట్ ధరను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించే సమయానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం సమకూరుతుందనేదానిపై స్పష్టత రానుంది.

Tags : Telangana, Rajiv Swagruha, auction, houses, Bandlaguda, Pocharam, GO

Advertisement

Next Story

Most Viewed