నాణ్యమైన జీవనం కోసం గవర్నర్ అద్భుత చిట్కా

by  |
నాణ్యమైన జీవనం కోసం గవర్నర్ అద్భుత చిట్కా
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఎక్కువ కాలం జీవించడం ముఖ్యం కాదని, ఎక్కువ కాలం ఆరోగ్యంగా నాణ్యమైన జీవనం గడపడం ముఖ్యమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యోగా ద్వారానే నాణ్యమైన జీవనం సాధ్యమని ఆమె హితవు పలికారు. రాజ్ భవన్ నుంచి యోగా సప్తాహ్ – 2020 కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గవర్నర్ మాట్లాడుతూ.. యోగా ద్వారా సంపూర్ణ మానసిక, శారీరక, ఆధ్యాత్మక ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. అనేకమంది గర్భిణీ స్త్రీలకు యోగా సాధన ద్వారా సిజేరియన్ సర్జరీలు అవసరం లేకుండా కాన్పులు అవుతాయని వివరించారు. యోగా కూడా ఒక డాక్టర్ వలే సాధకుల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు యోగా సాధన ప్రోత్సహిస్తే వారిలో ప్రతిభ, ఆరోగ్యం మెరుగవుతాయని, విద్యలో సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ద్వారా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని, ఇది భారతీయ యోగాకు గొప్ప విజయమని, భారతీయులందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ ఆన్‌లైన్ యోగా సప్తాహ్ – 2020 కార్యక్రమాన్ని జూన్ 15- 21 వరకు విరాట్ భారత్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.



Next Story