ఇవి అత్యంత స్ఫూర్తివంతమైన మాటలు : గవర్నర్

by Anukaran |   ( Updated:2020-09-11 07:34:19.0  )
ఇవి అత్యంత స్ఫూర్తివంతమైన మాటలు : గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళి సై సూచించారు. వివేకానందుని చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం 127వ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠం, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ సంస్థలు సంయుక్తంగా సంప్రీతి దినోత్సవం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని బోధనలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యార్ధులు, యువతలో ఆత్మహత్య సంఘటనలు పెరుగుతుండటం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో సమస్యలను పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి, విజయం సాధించడానికి వివేకానంద బోధనలు ఎంతో దోహదపడతాయన్నారు. “సమస్తమైన శక్తి మనలోనే దాగుందని, సంకల్ప శక్తితో యువత అనుకున్నది సాధించవచ్చని”, స్వామి వివేకానంద చాటి చెప్పాడని, ఇవి అత్యంత స్ఫూర్తివంతమైన మాటలని గవర్నర్ అన్నారు. తాను 4వ తరగతిలో ఉన్నప్పుడు, గవర్నర్ తండ్రి వివేకానందుని పుస్తకం బహుకరించాడని, అప్పటి నుంచి తాను వివేకానందుని మాటలు, రచనల ద్వారా నిరంతరం స్ఫూర్తి పొందుతున్నానని తమిళిసై వివరించారు.

ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్‌లో స్వామి చేసిన ప్రసంగాలలో అతి ముఖ్యమైన అంశాలు మూఢత్వాన్ని, ద్వేషాన్ని వదలాలని చెప్పడం. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం వివిధ మతాలు ఒకదానినొకటి గౌరవించడం అత్యంత ఆవశ్యకమైనవన్నాడని తెలిపారు.రామకృష్ణ మఠం, అలాగే 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌లు భారతీయ విశిష్ట సంస్కృతి, వేదాంత భావనను, వివేకానందుని బోధనలు విశ్వవ్యాప్తం చేయడంలో గొప్పగా పనిచేస్తున్నాయని గవర్నర్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed