- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సర్కార్..
దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఊరించి.. ఊరించి ఊసురుమనిపించారు. కనీస వేతనం సిఫారసులకే పరిమితమైంది. ఆయా శాఖల్లో కీలకమైన బాధ్యతలన్నీ మోస్తున్న ఈ ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిల్చారు. కనీస వేతనం అమలు కూడా వర్తింప చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం వేతన సవరణ ప్రతిపాదించిన పీఆర్సీ కమిషన్నివేదికలను కాదని ఏకంగా 30 శాతం ప్రకటించారు. కానీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులకు కనీస వేతనం రూ. 19 వేలు అమలు చేయాలని సూచిస్తే.. అతి తక్కువగా రూ. 15వేలకే పరిమితం చేశారు. కాంట్రాక్ట్ఉద్యోగులకు ఈసారి పీఆర్సీలో అన్యాయం జరిగిందని ఉద్యోగవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వర్తింపుపై అస్పష్టత..
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగుల వేతనాలపై అంతా అస్పష్టత నెలకొంది. ఏ వర్గాలకు ఎంత మేరకు పెంచుతారనేది ఇప్పటికీ గండికోట రహస్యమే. ప్రస్తుతం కేవలం మూడు కేటగిరీల్లోనే వేతనాలను పెంచుతున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. కేటగిరీ–1లో రూ, 15,600, కేటగిరీ –2లో రూ. 19,500, కేటగిరీ –3 కింద రూ. 22,750గా ఖరారు చేశారు. కానీ ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల పరిధిలో ఆపై కేటగిరీల్లో కూడా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదాహరణగా ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి సెర్ప్, మెప్మా వంటి రంగాల్లో ఏండ్ల నుంచి విధుల్లో ఉన్న వారికి ఏ రకంగా పెంచుతారనేది తేల్చలేదు.
దాదాపు 15ఏండ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న మూల వేతనం చాలా తక్కువగా ఉంది. కొంతమందికి మూల వేతనం రూ. 10 వేలలోపే ఉంది. ఇప్పుడు వారికి 30 శాతం పెంచితే చాలా తక్కువే. మండలస్థాయి అధికారులకు ఉన్నా.. తక్కువ వేతనానికే పరిమితమవుతారు. అటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు కూడా వేతనాల పెంపు ఎలా ఉంటుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. దీనిపై అధికారులు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. ఇలా పలువురు ఉద్యోగుల వేతనాల పెంపుపై చాలా అస్పష్టత నెలకొంది.
సిఫారసు ఉత్తిదేనా..?
వేతన సవరణ కమిషన్ సిఫారసులు కూడా అక్కరకు రావన్నట్టుగా ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది. తెలంగాణ తొలి పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులకు మినహా.. మిగిలిన వర్గాలకు అన్యాయమే జరిగిందని పక్కాగా చెప్పుతున్నారు. దీనిపై కొన్ని సంఘాలు ఆందోళనకు కూడా గురవుతున్నాయి. అయితే పీఆర్సీ కమిషన్ సిఫారసులు ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని మరోసారి స్పష్టమైంది. వాస్తవంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్-4 స్థాయిలోకి వచ్చే ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కామాటి, కుక్, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు 2014 పీఆర్‌సీలో రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 13,000 నుంచి రూ. 46,060 స్కేల్ పరిధిలో ఉంటే, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.12 వేలు ఉండగా, దాన్ని రూ.19 వేలకు పెంచాలి.
గ్రూప్-3 పరిధిలోకి వచ్చే డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూ.స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిల్మ్/ఆడియో విజువల్/డేటా ఎం ట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్లకు పీఆర్‌సీ-2014 ప్రకారం రూ. 15,460-రూ.58330 పేస్కేల్ ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు తత్సమాన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15,000లు ఉండగా, దాన్ని రూ. 22,900లకు పెంచాలి.
గ్రూపు-3(ఏ) కేటగిరీ పరిధిలోకి వచ్చే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ఆర్‌పీఎస్-2014 ప్రకారం రూ. 21,230- రూ. 77,030 పేస్కేల్ పరిధిలోని కేటగిరీలకు ప్రస్తుతం నెలకు రూ. 17,500 చెల్లిస్తుండగా, దాన్ని రూ. 31,040లకు పెంచాలి. వీరికి భవిష్యత్తులో పే స్కేల్ రివిజన్ జరిగే వరకు సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానందున ఇది హోం గార్డులకు కూడా వర్తిస్తుంది. ఎర్న్‌డ్ లీవ్స్ తప్ప రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఇతర వసతులు వర్తిస్తాయి. 6 నెలల ప్రసూతి సెలవు వర్తిసుంది. ఈపీఎఫ్, ఈఎస్‌ఐలు కూడా వర్తింపజేయాలి.
కానీ ఏమైంది..?
ఈ సిఫారసులు చేసినా ఒక్కటి కూడా వర్తింపచేయలేదని తేలిపోయింది. ప్రతీ ఏడాది రూ. వెయ్యి చొప్పున పెంపును ఎక్కడా ప్రస్తావించలేదు. వేతన పెంపు చాలా అధ్వాన్నంగా మారింది. కనీస వేతనాలను అమలు చేస్తారని భావించారు. కానీ దాన్ని అసలే పరిగణలోకి తీసుకోలేదు.
ప్రస్తుతానికి అదనపు ఖర్చు రూ. 750 కోట్లు
ఇక ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రతినెలా రూ. 750 కోట్లు కేటాయించాల్సి వస్తోంది. దీనిపై ఆర్థిక శాఖ లెక్కలు స్పష్టం చేసింది. ప్రతీ ఏటా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికల్లో వెల్లడించింది. అయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్టెడ్ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులు మొత్తం 3 లక్షల మందికి కలిపి మరో రూ. 100 కోట్లు ఎక్కువ ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 50వేల ఉద్యోగాల భర్తీ చేస్తే ఈ అదనపు ఖర్చు రూ. 1000 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.
మొత్తం ఉద్యోగుల లెక్క..
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు.. 2,90,389
పెన్షనర్లు.. 2,88,416
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు.. 29,365
వర్క్ చార్టెడ్ ఉద్యోగులు.. 2,227
దినసరి వేతనజీవులు.. 6,482
ఫుల్‌టైం కాంటింజెంట్.. 2,408
పార్ట్‌టైం కాంటిజెంట్స్.. 8,407
హోంగార్డులు.. 17,862
వీఆర్ఏ.. 22,157
అంగన్వాడీ వర్కర్లు.. 63,443
కాంట్రాక్ట్ ఉద్యోగులు.. 62,239
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.. 58,128
అశా వర్కర్లు.. 27,045
విద్యా వలంటీర్లు.. 16,669
సెర్ప్ ఉద్యోగులు.. 4,156.