- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు మార్గదర్శకాలు విడుదల
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత వానాకాలం సీజన్‌కు రైతుబంధు సాయం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పది రోజుల్లోనే రైతుబంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం వ్యవసాయశాఖ మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 23వరకు రెవెన్యూశాఖ డిజిటిల్ సంతకాల ప్రక్రియను పూర్తిచేసిన పట్టాదారులకు మాత్రమే రైతుబంధును వర్తింప చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జనవరి 23తర్వాత పట్టాలకెక్కిన రైతులకు మాత్రం ఈ సాయం వచ్చే ఆర్థికసంవత్సరం నుంచి రానుంది. ఇలాంటి రైతులు దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం 62 వేల మంది ఉండగా అనధికారికంగా మాత్రం రెండున్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా. రెండు సీజన్‌లకు అందే రైతుబంధు సాయాన్ని వీరు కోల్పోతున్నారు. ఇక నుంచి ప్రతీ సీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలించి రైతుబంధు సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ఆ మార్గర్శకాల్లో పేర్కొని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలుచేయనున్నట్లు తెలిపింది. సీజన్ల వారీగా భూముల క్రయ, విక్రయాలను పరిశీలించి, అమ్మిన భూముల వివరాలను రైతుబంధు జాబితా నుంచి తొలగించి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీచేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి సాయం చేయనున్నట్లు పేర్కొంది.
చిన్న రైతులకు ముందుగా..
చిన్న, సన్నకారు రైతులకు ఈసారి కూడా మొదటి ప్రాధాన్యతగా పెట్టుబడి సాయం అందించనుంది. ఈసారి మొత్తం రూ. 7 వేల కోట్లను రైతుబంధుకు కేటాయించగా ఇప్పటికే రూ. 5,500 కోట్లను విడుదలచేసింది. ముందుగా నియంత్రిత సాగు విధానాన్ని పాటిస్తున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నోటిమాటగా చెప్పినా సీఎం ఆదేశాలతో రైతులందరికీ వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. మార్గదర్శకాల్లో భాగంగా ముందుగా తక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతో వారి ఖాతాల్లో నిధులు తొలుత జమ కానున్నాయి. ప్రత్యేక కేసుగా భావించి పెద్దపల్లి జిల్లా కాసులపల్లి రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు మార్గదర్శకాల్లో వెల్లడింది. కాసులపల్లిలో సుమారు 621 మంది రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకుంటుండగా ఈసారి రైతుబంధు ఇస్తామని ఆ మార్గదర్శకాల్లో వ్యవసాయ శాఖ కమిషనర్ పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు పథకం వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. భూముల వివరాలన్నీ ఏడాదిలో ఒకేసారి పరిగణలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త పట్టాదారులకు రైతుబంధు అందదు
ఇప్పటివరకు ఎంత మేరకు భూ క్రయ విక్రయాలు జరిగాయో, ఎంత సాగుభూమి సాగేతర అవసరాలకు మారిందో వివరాలు ఇవ్వని ప్రభుత్వం ఇలాంటి వాటన్నింటి సంగతిని వచ్చే సంవత్సరానికి వాయిదా వేసింది. కొత్తగా సాగుభూమిని కొన్న రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందదు. పాత జాబితా ఆధారంగానే ఖాతాలకు జమ కానుంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియను మార్చుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రైతుబంధు పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపింది. వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఛైర్మన్‌గా, కమిషనర్ కన్వీనర్‌గా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఎస్ఎల్‌బీసీ కన్వీనర్, ఎన్ఐసీ ఇన్‌ఫర్‌మేషన్ ఆఫీసర్ సభ్యులుగా రాష్ట్ర కమిటీలో వ్యవహరించనున్నారు. జిల్లాలో స్థాయిలో ఇదే పద్దతిలో కమిటీ ఉంటుంది. ఇక రైతుబంధు వదులుకునే వారు ‘గివ్ ఇట్ అప్’ ఫారం ఇవ్వాలి కోరంది. వదులుకున్న మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
59.30 లక్షల పట్టాదారులు
రాష్ట్రంలో జనవరి 23నాటికి రెవెన్యూ రికార్డుల ప్రకారం 59.30 లక్షల మంది పట్టాదారులున్నారు. వీరి స్వాధీనంలో మొత్తం కోటి 47లక్షల 66వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులు 92వేల మంది ఉన్నారు. 92వేల గిరిజన కుటుంబాల్లో 2.99 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరందరికీ రైతుబంధు వర్తిస్తుంది. కానీ వివిధ సాంకేతిక సాకులతో లక్షలాది మందికి రైతుబంధు సాయం రావడం లేదు. గత మూడు విడతల్లో ఈ కోవలోకి వచ్చిన 18.45 లక్షల మంది పట్టాదార్లకు రైతుబంధు నిధులు జమ కాలేదు. 2018 ఖరీఫ్‌లో 1.30 కోట్ల ఎకరాల్లో 50.25 లక్షల మందికి విడుదలైంది. 2018-19 ఖరీఫ్‌లో 1.40 కోట్ల ఎకరాల్లో 54.53 లక్షల మంది పట్టాదారులు ఉండగా, 49.10 లక్షల మంది బ్యాంకు వివరాలను సమర్పించారని అధికారులు వారి లెక్కల్లో తేల్చారు. బ్యాంకు ఖాతాలు సమర్పించిన 1.31 కోట్ల ఎకరాల్లోని 49.03 లక్షల మందికి నగదు బదిలీ చేశారు. ఈ విడతలో బ్యాంకు ఖాతాలు సమర్పించిన 7వేల మందికి రైతుబంధు అందలేదు. పలు సాంకేతిక సమస్యలతో 5.43 లక్షల మంది, బ్యాంకు ఖాతాలు సమర్పించినా 7వేల మందికి పెట్టుబడి సాయం ఆగింది.
2019 ఖరీఫ్‌లో 1.45 కోట్ల ఎకరాల్లో 56.76 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. వీరిలో 52.95 లక్షల మంది బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించి వారి నిధులు మంజూరు చేశారు. వీరిలో 50.98 లక్షల మందికి రూ. 6042 కోట్లను చెల్లించారు. బ్యాంకు ఖాతాల సక్రమంగా లేని వారు 3.81 లక్షల మంది, బ్యాంకు ఖాతాలు ఇచ్చినా కూడా జమ కాని వారు 1.97 లక్షల మందితో కలుపుకుని మొత్తం 5.78 లక్షల మందికి ఈసారి రైతుబంధు అందలేదు. 2019-20 రబీలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల్లో 47.50 లక్షల మంది అర్హులుగా గుర్తించగా బ్యాంకు ఖాతాలను ట్రెజరీలో జమ చేసిన రైతులు 42.42 లక్షలుగా పేర్కొన్నారు. అంటే 5.08 లక్షల మంది ఖాతాలు సరితూగలేదు. మిగిలిన 42.42 లక్షల మందిలో 40.26 లక్షల మందికి రూ. 3925 కోట్లు జమ చేశారు. బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉన్న వారిలో కూడా 2.16 లక్షల మందికి గత రబీలో పెట్టుబడి సాయం రాలేదు. ఈసారి కూడా ప్రభుత్వం మొత్తం 59.30 లక్షల మంది పట్టాదారులున్నట్లు జాబితాలో వెల్లడించారు. 1.47 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీరందరికీ రైతుబంధు వస్తుందా అనేది ప్రశ్నార్థకంగానే మారింది.
రైతుబంధు వివరాలు