వీఆర్వో వ్యవస్థ రద్దు..?

by Shyam |
వీఆర్వో వ్యవస్థ రద్దు..?
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో వేగం పెరిగింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా వీఆర్వో వ్యవస్థ రద్దు, జాప్యం లేకుండా మ్యుటేషన్లు వంటి వాటిపై కసరత్తు జరుగుతోంది. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ల పేరు మార్పిడిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పరిశోధన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన భూ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, వాటికి రిటైర్డ్ జడ్జిల నియామకం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రధానాంశాల్లో వేటికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేస్తారన్నదే కీలకం.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 1984-2001 మధ్య కాలం నాటి పరిస్థితులకు పాలన అద్దం పడుతోంది. ప్రధానంగా టీడీపీ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, తహసీల్దార్ల పేర్లు మండల రెవెన్యూ అధికారులుగా మార్పిడి, పంచాయతీ సెక్రటరీల నియామకం(మార్పిడి), కొత్త మండలాల ఏర్పాటు, కొత్త డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ నడిచింది. ఇప్పుడూ అదే మాదిరిగా వీఆర్వోల వ్యవస్థ రద్దు, కలెక్టర్ల పేర్లు మార్పు, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటివి సాగుతున్నాయి. పాలనాపరమైన వెసులుబాటును కలిగిస్తూ అధికారాల వికేంద్రీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు కలిగించే విధానాలు అమలు చేస్తున్నారు. మ్యుటేషన్ల విధానంలోనూ పాత పద్ధతుల పునరుద్ధరణ దిశగానే అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ సంస్థానంలో రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉండేది కాదు. ఎంతో ప్రాసెస్​ తర్వాత రిజిస్టర్​లో పేరు మార్పులు జరిగేవి. ఇప్పుడూ అటోమెటిక్ ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా చేపట్టే విధానానికి తెరతీస్తున్నారు. బీహార్, కర్నాటక రాష్ట్రాల మాదిరిగానే జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి రిటైర్డ్ జడ్జిలను నియమించడంతో ఏ మేరకు సత్ఫలితాలు వస్తాయో, పారదర్శకత ఏ స్థాయిలో ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది. కాగా, కొత్త రెవెన్యూ చట్టంపై ప్రశ్నించేందుకు ఉద్యోగ సంఘాలు భయపడుతున్నాయి. అనుభవ పాఠాల నుంచి తమ ఉద్యోగాలను తాము చేసుకోవడం తప్ప మరో మార్గమేదీ కనిపించడం లేదని ఓ డిప్యూటీ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

అనుభవం.. కసరత్తు..

కొత్త రెవెన్యూ చట్టంపై ప్రగతి భవన్, భూ పరిపాలన కార్యాలయం కేంద్రంగా కసరత్తు సాగుతోంది. దాని రూపకల్పనకు రెవెన్యూ చట్టాలపై అత్యంత అనుభవం కలిగిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అధ్యక్షతన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు అహర్నిషలు కష్టపడుతున్నారు. కాగా, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ భ్రష్ఠు పట్టడానికి గల కారణాలైన చట్టాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, అమలుకు విధానపరమైన అడ్డంకులను గుర్తించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధరణి వెబ్ సైట్ లో పట్టాదారు పేరును సరిచేయడానికి జరుగుతున్న తీవ్ర జాప్యాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. దాన్నుంచే అవినీతికి ఏర్పడే ఆస్కారాన్ని గుర్తు చేస్తున్నారు. చట్టం రూపొందిస్తున్న సీనియర్ ఐఏఎస్ లు ఇలాంటి లోపాలను గుర్తించాలని ఉద్యోగ సంఘ నాయకులు సూచిస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళన..

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మొత్తంగా వీఆర్వో వ్యవస్థనే రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తలతో గందరగోళానికి గురవుతున్నారు. అనాదిగా నడుస్తున్న వీఆర్వోల వ్యవస్థ రద్దు వెనుక ఆంతర్యం అవినీతి, అక్రమాలుగానే అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇన్నాళ్లుగా విధానపరమైన లోపాలను సరిదిద్దకుండా 2017 నుంచి అవినీతికి ఆస్కారం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. అవినీతి కేసుల్లో వీఆర్వోల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు కానీ, అది కేవలం రూ.10 వేల లోపు నగదు తీసుకున్న సందర్భాలే ఉన్నాయని, అదే తహసీల్దార్లు మాత్రం రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు ఉంటోందని కింది స్థాయి సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. పురాతన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ రద్దు వెనుక సీఎం కేసీఆర్ ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.

శాఖల్లో విలీనంపై సందేహం..

రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ స్ట్రెంథ్ ప్రకారం వీఆర్వోల సంఖ్య 7300, వీఆర్ ఏల సంఖ్య 24 వేలు, విధుల్లో మాత్రం 4800 వీఆర్వోలు, 21 వేల మంది వీఆర్ ఏలు ఉన్నారు. ఈ రెండు శ్రేణులను ఇతర శాఖల్లో విలీనం చేస్తారని అధికారులు చెబుతుండడంతో వీరందరినీ ఏయే శాఖల్లో సర్దుబాటు చేస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్​ వీఆర్ఏలను గ్రేడ్ 2 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించగా, ఇక్కడేమో శిక్షణకు భిన్నంగా ఇతర శాఖల్లో విలీనానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్ లో వీఆర్ఏ సంఘాలతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీని నిలుపుకుంటారని వేలాది వీఆర్​ఏ కుటుంబాలు భరోసాతో ఉన్నాయి.

భూ సర్వే చేయాలి : గోల్కొండ సతీష్, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోల సంఘం

వీఆర్వోల విలీనం అధికారికంగా రాలేదు. కానీ మీడియాలోనే రాస్తున్నారు. విలీనానికి మేం సిద్ధం కాదు. మేం రెవెన్యూ శాఖలోనే కొనసాగుతాం. అవమానకరంగా ఇతర శాఖలకు పంపడం భావ్యం కాదు. 2001 లో పంచాయతీ సెక్రటరీలుగా పంపినప్పుడు రికార్డులు అస్తవ్యస్తంగా మారాయి. దాంతో 2007లో తిరిగి రప్పించారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. గ్రామీణ స్థాయిలో వీఆర్వో ఉండాల్సిందే. లేకపోతే ప్రతి పట్టాదారుడికి సత్వర సేవలు అందడం కష్టం. అవినీతికి విధానపరమైన లోపాలపై అధ్యయనం చేయాలి. సమీక్షించాలి. అప్పుడే అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ ఏర్పడుతుంది.

సొంత నిర్ణయాలతో చట్టం : రమేష్ బహదూర్, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్ఏల సంఘం

సీఎం కేసీఆర్ పై విశ్వాసం ఉంది. మమ్మల్ని తొలగిస్తారనో, వేరే శాఖల్లో విలీనం చేస్తారనో అనుకోవడం లేదు. మేం నమ్మడం లేదు. 24 గంటలూ పని చేస్తున్నాం. ప్రతి పనిలో మేం ఉన్నాం. మేం ఉద్యోగ బాధ్యతల స్వీకరించేటప్పుడు రెవెన్యూ పనులపైనే శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు మరో శాఖలో పని చేయడానికి మేం సిద్ధంగా లేం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అవినీతి ఏ స్థాయిలోనైనా తప్పే. కానీ అది ఎవరి స్థాయిలో ఎక్కువ ఉన్నదో, జనం పడుతున్న ఇబ్బందికి కారణం ఎవరో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తే తెలుస్తుంది.

విలీనమని అధికారుల నుంచి సమాచారం : గరికె ఉపేందర్ రావు, అధ్యక్షుడు, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం

వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తారని అధికారుల నుంచి సమాచారం వస్తుంది. విలీనానికి మేం అభ్యంతరం వ్యక్తం చేస్తాం. మేం రెవెన్యూలో పని చేయడానికి నియామకమయ్యాం. మమ్మల్ని అవమానించి బయటికి నెట్టేస్తే ఎట్లా? సీఎం కేసీఆర్ మా మాటలు వినాలి. 15 నిమిషాలు టైం ఇవ్వాలి. విధానపరమైన లోపాలను సవరించకుండా అవినీతికి కారణం మేమంటే ఎట్లా? తప్పుడు రిపోర్టుల ద్వారా నిర్ణయం తీసుకోవద్దు. మేధావులు స్పందించాలి. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ లేకపోతే ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి. సీఎం కేసీఆర్ పునరాలోచించాలి.

Advertisement

Next Story