ప్రకటనల్లోనే డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్

by Anukaran |
ప్రకటనల్లోనే డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. చెరువుల సంరక్షణపై సర్కారు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నది. హైదరాబాద్ సిటీతోపాటు హెచ్ఎండీఏ విస్తరించిన ప్రాంతంలోని 3,132 చెరువుల్లో దాదాపు 1,000 చెరువుల వరకు ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న మహానగర శివారు ప్రాంతాలకు ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. ప్రణాళికలు అంతకన్నా లేవు. కానీ, లే ఔట్లకు, బహుళ అంతస్థుల భవన నిర్మాణాలకు స్థానిక, నగర పాలక, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. దీంతో ఉన్న కాలనీలు విస్తరిస్తూ, కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. కానీ, వీటి నుంచి నిత్యం వెలువడే మిలియన్ల లీటర్ల మురుగు నీరు ఎక్కడికి వెళ్లాలి..? అదేమి కావాలి..? అందుకు చేయాల్సిన ఏర్పాట్లు ఏమిటి..? వంటి వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

కాలుష్య కోరల్లో 185 చెరువులు..

నగరంలో ప్రణాళికాబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నేరుగా స్థానికంగా ఉండే నీటి వనరుల్లోకి వెళ్తుంది. ఇది వాటర్ యాక్టుకు పూర్తిగా విరుద్ధం. నీటి చట్టం ప్రకారం కలుషిత జలాలు చెరువుల్లోకి గానీ, కాలువలు, వాగులు, నదుల్లోకి చేరకూడదు. ఈ విషయాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్ లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఆచరణలో మురుగు నీటి వనరుల్లోకే వెళ్తుంది. నగరానికి ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ కోసం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ఎన్‌జీటీకి సమర్పించిన నివేదికలో జలమండలి స్పష్టం చేసింది. కానీ, అది నేటికీ కార్యరూపంలోకి రాలేదు. నగరంలోని 185 చెరువులు నేడు కాలుష్య కాసారాలుగా మారాయి. శివారులో ఔటర్ రింగ్ రోడ్ లోపలివైపున ఉన్న 190 గ్రామాల పరిధిలోని కొత్త, పాత కాలనీలకు మురుగు నీరు పారుదలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. కానీ, అభివ‌ృద్ది పేరుతో లేఅవుట్లకు, భవనాలకు అనుమతులు మంజూరు చేసే సంస్థలు అభివృద్ధి రుసుంలను వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు నగరంలో జలమండలి, శివారులో పట్టణ స్థానిక సంస్థలు భవనాలకు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు డ్రైనేజీ కనెక్షన్‌లను మంజూరు చేస్తున్నాయి. మంజూరు చేసిన కనెక్షన్లున్న పైప్‌లైన్లు చివరకు ఎక్కడికి చేరుతాయి..? వాటి నుంచి వచ్చే మురుగు ఏమి చేయాలి..? అనేదానికి వాటి వద్ద స్పష్టత లేదు.

ఎస్‌టీపీల విస్మరణ..

నిబంధనల ప్రకారం ఇళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను అనుసంధానం చేసుకుంటూ ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను నెలకొల్పాలి. ఈ వ్యవస్థ ద్వారా పారే మురుగు నేరుగా మురుగు శుద్ధి కేంద్రాలకు (ఎస్‌టీపీ) చేరుకోవాలి. ఆ కేంద్రాల్లో మురుగు, నీరు వేర్వేరుగా విడిపోయి శుద్ధి చేసిన వాటర్ నీటి వనరుల్లోకి చేరాలి. వేరు చేయబడిని మురుగు వ్యర్థాలు ఎరువులుగా వాడేందుకు వినియోగించేలా తయారు చేయాలి. విషయ రసాయనాలు ఉన్నట్టైతే పీసీబీ సూత్రాల ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. కానీ, సర్కారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇందుకు స్థానిక సంస్థలు, జలమండలి చర్యలు కనబడటం లేదు. పురపాలక శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవవహరిస్తున్నది. ఫలితంగా నీటి వనరులు నాశనమవుతున్నాయి.

Advertisement

Next Story