రిటైర్డ్ ‘హర్ట్’

by  |
రిటైర్డ్ ‘హర్ట్’
X

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ను 61 ఏండ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీనిచ్చారు. కానీ దానిపై నేటికీ క్లారిటీ ఇవ్వలేకపోతోంది ప్రభుత్వం. ఏటా వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, సీఎంకు ఉద్యోగ సంఘాల నాయకులు విన్నవిస్తూ వస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల నుంచి సంఘాల నాయకులు ఒత్తిడి పెరుగుతోంది. వారి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి కచ్చితమైన ప్రకటన రాక, ఇటు ఉద్యోగులకు సమాధానం చెప్పలేక సంఘాల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై జూన్ 2న ప్రకటన వెలువడుతుందేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా వేతనాల్లో కోతలు విధించడం పల్ల ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుతో ఉన్నారు. ఈ సమయంలో రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై ప్రకటన చేసి వారిని కాస్త శాంతింపజేస్తారేమో వేచిచూడాలి.

దిశ, న్యూస్ బ్యూరో: ‘‘ కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడ్తది. ఏం చేయాలే.. దాదాపు ఏడాదిన్నర అవుతున్నది. కనీసం రిటైర్మెంట్ ఏజ్ పెంచినా ఉద్యోగుల్లో కొంతైనా సంబురం ఉంటుండే. కానీ ఎవరికి చెప్పినా.. ఎంత చెప్పినా లాభం లేకుండా పోతోంది. జిల్లాల మీటింగ్ కు పోవాల్నంటే కూడా కష్టమైతాంది. అక్కడ అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నం. సీఎంతో కలిసి వస్తున్నరు… మీరు ఏం చేస్తున్నరని అడుగుతున్నరు…’’ ఇది ఉద్యోగ సంఘాల నేత ఆవేదన.

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం ఇంకా హామీగానే మిగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు దాదాపు ఏడాది కాలంగా అప్పుడో.. ఇప్పుడో అన్నట్టుగానే సాగదీస్తున్నారు. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై ఇటు ఉద్యోగ సంఘాల నేతలకు తలనొప్పి వ్యవహరంగా మారింది. ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తికి కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వానికి అండగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలను సైతం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రులందరికీ విన్నవిస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకున్న రాష్ట్రాలు అమల్లోకి తీసుకువచ్చాయి. ఏపీతో పాటుగా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయస్సు పెంచారు. కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మన రాష్ట్రంలో ఇంకా ఒక్క అడుగు కూడా పడటం లేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా పీఆర్సీ ఎప్పుడొస్తుందా అని వేయి కండ్లతో ఎదురుచూశారు. అది ఎండమావిగానే మిగిలిపోయింది. కనీసం ఐఆర్ అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం, పంద్రాగస్టు లాంటి సందర్భాల్లో ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అది కూడా రాలేదు. పైగా కరోనా కష్టకాలంలో యాభై శాతం వేతనానికి కోత పడింది. అయినా మౌనంగానే ఉండిపోయారు. కనీసం ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచే హామీపై జూన్ 2 నాటికి ప్రకటన చేస్తారనే ఆశతో ప్రగతి భవన్‌వైపు చూస్తున్నారు.

ఆర్టీసీ సమ్మెతో చెడిందెవ్వరో..
గత ఏడాది జరిగిన ఆర్టీసీ సమ్మె ఉద్యోగ వర్గాలకు అన్యాయమే చేసింది. ఉద్యోగ సంఘాలు సమ్మె కాలంలో స్తబ్దుగా ఉండటం, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు కొంతైనా నెరవేరుతాయనే ఆశతో ఉన్నారు. కానీ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఆశించినదాని కంటే ఎక్కువగా నెరవేరాయి. ఆర్టీసీ కార్మికులంతా రెగ్యులర్ కావడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెరిగింది. వేతనాలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఒక్కసారి కూడా పిలువలేదు. ఈ పరిణామాల్లో నిలకడగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాలు కొంత బద్నాం అయినప్పటికీ.. తమ ఉద్యోగుల సమస్యలు తీరుతాయనే ఆశాభావంతో ఉన్నారు. కానీ, ఒక్క సమస్య కూడా కాగితాలకెక్కకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో కూడా అయోమయం నెలకొంది.

ఖజానాకు భారమేమీ కాదు..
ప్రస్తుతం ఉద్యోగ విరమణ పెంపు అంశంపై ఉద్యోగ సంఘాలు లెక్కలేసీ ప్రభుత్వానికి వివరాలు సమర్పించింది. 2020 నుంచి 2023 వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులు, వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వివరాలన్నీ సమర్పించారు. దీనికి సంబంధించిన అంశాలను సీఎస్‌కు వివరించారు. అంతేకాకుండా ఈ మూడేండ్ల కాలంలో ఉద్యోగ విరమణ పెంపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.11,725 కోట్లు మిగులుతాయని, ఆర్థిక భారం ఉండదని లెక్క తేల్చారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో పీఆర్సీ, ఐఆర్ వంటి డిమాండ్ల జోలికి వెళ్లకుండా ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించగల్గుతామని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఉద్యోగులకు రెగ్యులర్‌గా వచ్చే డీఏ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని చెబుతున్నారు. ప్రస్తుతం రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనంటూ మూడేండ్ల వివరాలను సీఎస్‌కు అందజేశారు. ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు 9790 మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారని, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.4895 కోట్లు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఒక్కో నెల వీటి కింద రూ.407.92 కోట్లు చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయస్సు పెంచితే నెలకు రూ.83.22 కోట్లు వేతనాలు చెల్లించాలని, ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.324.70 కోట్లు మిగులుతాయని, ఏడాదికి రూ.3896.40 కోట్ల ఆర్థిక భారం ఉండదని నివేదికల్లో వెల్లడించారు.

దీనిపై పదేపదే వాయిదాలు వేయడంపై కూడా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పుడు కూడా దీనిపై నిర్ణయం తీసుకుంటారా.. లేదా కరోనా సాకుతో మరో ఏడాది కాలం వెళ్లదీస్తారా.. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలంటూ సాగదీస్తారంటూ ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై సీఎం కేసీఆర్‌కు విన్నవించాలని ఉద్యోగ సంఘాలు విశ్వ ‌ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు తమ ఉద్యోగుల మంత్రిగా భావించే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దగ్గర రోజువారీగా మొర పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు.

ఏం చేయాలిప్పుడు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నేతలకు తలనొప్పి వ్యవహరంగా మారింది. ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేద్దామంటూ జిల్లాల నుంచి ఒత్తిడి వస్తుంది. ఇప్పుడున్నపరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే మీమాంసలో ఉంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు కూడా విమర్శలు తప్పడం లేదు. ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని, మీరేం సాధిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. అంతేకాకుండా వచ్చే రెండు నెలల కాలంలో కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుండటంతో.. తక్షణ కర్తవ్యం ఏమిటనే డోలాయమానంలో ఉన్నారు. కానీ ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతారా.. లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతున్నది.

తాజాగా తెరపైకి జీతాల కోత అంశం..
ఇప్పటికే ఉద్యోగ సంఘాల నెత్తిన జీతాల కోత అంశం పడింది. మార్చి, ఏప్రిల్ నెలలో 50 శాతం వరకు జీతాలను తగ్గించి ఇవ్వడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. మే నెల వేతనంలో కూడా కోత విధిస్తారా.. అనేది ఇంకా తేలలేదు. కోత పెట్టిన జీతాలను ఎప్పుడు చెల్లిస్తారో కనీస సమాచారం కూడా లేదు. మరోవైపు ఏపీలో పూర్తి జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో మన దగ్గర పరిస్థితి ఏమిటని ఉద్యోగ సంఘాలపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల వ్యవహారంపై గుర్రు మీదున్న కిందిస్థాయి ఉద్యోగులు.. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత మండిపడుతున్నారు.

01-04-2020 నుంచి 31-03-2021 వరకు…
పదవీ విరమణ పొందే ఉద్యోగులు : 9790
చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ : రూ. 4895 కోట్లు

01-04-2021 నుంచి 31-03-2022 వరకు..
పదవీ విరమణ పొందే ఉద్యోగులు : 9419
చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ : రూ. 4709.50 కోట్లు

01-04-2022 నుంచి 31-03-2023 వరకు..
పదవీ విరమణ పొందే ఉద్యోగులు : 10,353
చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ : రూ. 5176.50 కోట్లు

ఈ మూడేండ్లు ఉద్యోగ విరమణ వయస్సును పెంచితే వేతనాలుగా చెల్లించాల్సిన సొమ్ము రూ.3055.68 కోట్లు. దీని ప్రకారం ఉద్యోగ విరమణ పొందుతున్న వారికి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కింద రూ. 14,781 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వానికి వివరించారు. దీంతో ప్రభుత్వానికి రూ.11,725 కోట్ల ఆర్థికభారం తగ్గుతుందని వెల్లడించారు.


Next Story

Most Viewed